మెట్రో రికార్డు.. ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో సోలార్‌ పవర్‌!  

30 Dec, 2022 13:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌ మెట్రో సౌరకాంతుల శోభను సంతరించుకోనుంది. 31 కి.మీ. మేర చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 9 నుంచి 10 స్టేషన్లను నిర్మించనున్నారు. స్టేషన్లలో పూర్తిస్థాయిలో సౌరశక్తి వినియోగం ఆధారంగా విద్యుత్‌ దీపాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు తదితర విద్యుత్‌ ఆధార ఉపకరణాలు పనిచేసేలా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ సంస్థ చర్యలు చేపట్టనుంది.

ఇప్పటికే తొలిదశ మెట్రో ప్రాజెక్టులో 28 మెట్రోస్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్‌ డిపోల్లోని ఖాళీప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్‌ సోలార్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. మెట్రోస్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్‌ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు తొలిదశ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ వర్గాలు తెలిపాయి.

తొలిదశలో సౌరశక్తి వినియోగం ఇలా.. 
సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో సంస్థ దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినప్పుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేలా రిజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. సౌరశక్తి, రిజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రోస్టేషన్లు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందాయి. 

లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ 
అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌ ప్లాటినం సర్టిఫికెట్‌ను కూడా మెట్రో సాధించింది. మెట్రోస్టేషన్లను 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం, క్రాస్‌ వెంటిలేషన్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్‌ డిపోల్లో వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడుగుంతలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. 

మరిన్ని వార్తలు