5 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ యోచన 

22 Sep, 2022 03:23 IST|Sakshi

తెలంగాణ రెడ్‌కోతో ప్రాథమికంగా చర్చలు 

అమల్లోకి వస్తే కాళేశ్వరం విద్యుత్‌ భారం తగ్గే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ‘తప్పనిసరి పునరుత్పాదక విద్యుత్‌ (ఆర్పీవో) కొనుగోళ్ల’ విషయంగా కేంద్రం భారీ లక్ష్యాలు పెట్టిన నేపథ్యంలో.. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లపై ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లు, లోయర్‌ మానేరు వంటి జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్కో), నీటిపారుదల శాఖ చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. 

రామగుండంలో ఫ్లోటింగ్‌ ప్రాజెక్టు 
రాష్ట్రంలో ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, జైపూర్‌లో సింగరేణి సంస్థలు తమ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే జలాశయాలపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించాయి. రామగుండంలోని 500 ఎకరాల జలాశయంపై ఎన్టీపీసీ 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను నిర్మించింది. అదే మల్లన్నసాగర్‌ జలాశయం 22 వేల ఎకరాల్లో ఉంటుంది.

మిగతా జలాశయాలూ భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లపై 5 వేల మెగావాట్ల మేర సౌర విద్యుత్‌ ప్లాంట్లను స్థాపించవచ్చని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో స్థలం అద్దె రూపంలో నీటి పారుదల శాఖకు ఆదాయం కూడా వస్తుందని పేర్కొంటున్నాయి. మరోవైపు కాళేశ్వరం వంటి భారీ లిఫ్టులకు చౌకగా విద్యుత్‌ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.  

భూసేకరణ సమస్య తప్పుతుంది! 
భారీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు అవసరం. రాష్ట్రంలో భూముల కొరత తీవ్రంగా ఉంది. ధరలూ భారీగా పెరిగిపోయాయి. సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు భారీగా భూసేకరణ జరపడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనికాదు. భారీ వ్యయంతో భూములు కొని సోలార్‌ ప్లాంట్లు పెట్టినా దానివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి.. విద్యుత్‌ ధరలు భారీగా పెరిగిపోతాయి. అదే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లతో భూసేకరణ సమస్య తప్పుతుందని, విద్యుత్‌ ధర తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో టెండర్లు ఆహ్వానించి ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు డెవలపర్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు