పీకే మహంతి పక్షపాతం చూపారు

20 Apr, 2022 01:31 IST|Sakshi

నిష్పాక్షికంగా వ్యవహరించారన్న వాదన అబద్ధం

హైకోర్టుకు నివేదించిన సోమేశ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రత్యూష్‌ సిన్హా కమిటీ సభ్యుడు పీకే మహంతిపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పలు ఆరోపణలు చేశారు. ఆల్‌ ఇండియా సర్వీసు ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన పీకే మహంతి పక్షపాతంతో వ్యవహరించారని సోమేశ్‌ కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. కమిటీ సభ్యుడిగా మహంతి నిష్పాక్షికంగా వ్యవహరించారని చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు.

తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్నారు. ఐఏఎస్‌ పదవికి పీకే మహంతి రాజీనామా చేయడం ద్వారా తన అవకాశాలను దారుణంగా దెబ్బతీశారని సోమేశ్‌ హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ నందా ధర్మాసనం తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడ తామని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఏఎస్, ఐపీఎస్‌ కేటాయింపులను రద్దు చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస్టిస్‌ భుయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ, పీకే మహంతి రాష్ట్ర విభజనకు ఒక్కరోజు పదవీ విరమణ చేసినందున ఆయన పేరును జాబితాలో చేర్చలేదన్న కేంద్రం వాదన సరికాదన్నారు. జూన్‌ 1న మహంతి పేరు మీద పలు జీవోలు జారీ అయ్యాయని, ఐవీఆర్‌ కృష్ణా రావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ జీవో కూడా ఇచ్చారని తెలిపారు.

ఆయన సర్వీసులో ఉన్నారనేందుకు ఈ జీవోలే సాక్ష్యమని వివరించారు. తాత్కాలిక జాబితాలో ఉన్న పలువురు అధికారుల పేర్లు తుది జాబితాలో లేవన్నారు. లాటరీలో రోస్టర్‌ను ముందుగా తెలం గాణకే కేటా యించాల్సిందని, అయితే అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని సీతారామమూర్తి చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు