కన్నతల్లిపై కత్తితో కొడుకు దాడి

1 Aug, 2021 03:46 IST|Sakshi
ఘటనాస్థలంలో వివరాలు సేకరిస్తున్న రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి

పరిస్థితి విషమం.. గాంధీ ఆస్పత్రికి తరలింపు 

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఘటన 

నంగునూరు(సిద్దిపేట): కన్న కొడుకే తల్లిపై కత్తితో దాడి చేశాడు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి సారవ్వ (52) పదేళ్ల కిందట భర్త మరణించడంతో కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకును పెంచి పోషించి పెళ్లిళ్లు జరిపించింది. అయితే తాగుడుకు బానిసగా మారిన కొడుకు తిరుపతి (23) కొన్ని రోజులుగా డబ్బుల విషయమై భార్య, తల్లితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తల్లీ కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో ఆవేశానికి లోనైన తిరుపతి ఇంట్లో ఉన్న కత్తితో తల్లిపై దాడి చేశాడు. కొడుకు బారి నుంచి తప్పించుకునేందుకు ఆమె ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తినా.. వెంబడించి మెడ, చేతులు, ఛాతీ భాగంపై ఇష్టారీతిగా దాడి చేశాడు. దీంతో సారవ్వ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన గ్రామస్తులు ఆమెను 108 అంబులెన్స్‌లో సిద్దిపేటలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. సర్పంచ్‌ తిప్పని రమేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు