దయనీయ పరిస్థితి.. బతికుండగానే పెద్దకర్మ! 

29 Oct, 2021 09:07 IST|Sakshi

సాక్షి, నకిరేకల్‌(నల్లగొండ): ఇంటికి పెద్ద కొడుకని ఎంత ముద్దు చేసి ఉంటుంది? కానీ బతికుండగానే ఆ తల్లికి పెద్దకర్మ చేయాలని చూశాడా కుమారుడు. తోడబుట్టిన వారికే అన్నీ పంచిపెడుతోందని కన్నతల్లిపై కక్షగట్టిన ఆ ప్రబుద్దుడు.. బతికున్న తన తల్లి పేరుతో సంతాప కార్డు ముద్రించాడు. దీంతో విషయం తెలిసిన అతని తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన వారణాశి పోశమ్మకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. వృద్ధాప్యంలోనూ కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. పోశమ్మ పెద్ద కుమారుడు యాదగిరి తన తల్లి సంపాందించిన సొమ్మును కూతుళ్లకే పెడుతోందని కక్ష పెంచుకున్నాడు. అదికాస్తా శృతిమించి చివరకు తన తల్లి చనిపోయిందని, పెద్ద కర్మ చేస్తున్నామని సంతాప కార్డులను ప్రింట్‌ చేయించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు.

ఈ విషయం పోశమ్మకు తెలిసింది. కొడుకు చేసిన పనికి కన్నీరుమున్నీరైంది. తాను చనిపోక ముందే చనిపోయినట్లు కొడుకు చేసిన నిర్వాకంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై నకిరేకల్‌ సీఐ నాగరాజు వెంటనే స్పందించి పోశమ్మ పెద్ద కూమారుడు యాదగిరిని పిలిపించారు. పోలీసుల సమక్షంలో యాదగిరి త న తల్లికి క్షమాపణ చెప్పాడు. అంతే ఆ తల్లి మనసు కరిగిపోయిది. ఆదివారం తమ కుటుంబ సభ్యుల మధ్య అన్నీ మాట్లాడుకుంటామని పోలీసులకు చెప్పి తల్లీ, కొడుకులు ఇంటికి వెళ్లిపోయారు.

చదవండి: అసభ్యకర ప్రవర్తన: యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ సస్పెన్షన్‌

మరిన్ని వార్తలు