కరోనా వచ్చిందని తల్లిని బావి దగ్గర వదిలేశారు..

6 Sep, 2020 13:14 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్నే కాదు, రక్త సంబంధాలను కూడా కాలరాస్తున్నాయి. రక్తం పంచి జన్మనిచ్చిన మాతృమూర్తినే కడుపున పుట్టినవాళ్లు కాదనుకున్నారు. తల్లికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఇంట్లో నుంచి తీసుకువెళ్లి వ్యవసాయ బావి వద్ద వదిలేశారు. ఈ సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో చోటుచేసుకుంది. మారబోయిన లచ్చమ్మ (82)కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తల్లిని ఒంటరిగా వ్యవసాయ బావి వద్ద వదిలేసారు కన్న కొడుకులు.

ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వ్యవసాయ బావి వద్దే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. కన్నకొడుకే ఇలా చేయడంపై వాపోతున్నారు. తనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు చెబుతున్నారు. వృద్ధురాలి పరిస్థితిని చూసి స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు ఆందోళన చెందారు. చివరకు పోలీసుల సాయంతో స్థానికులు వృద్ధురాలి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆమె చిన్న కొడుకు ఇంటోనే లచ్చమ్మ క్వారంటైన్‌లో ఉండనున్నారు. (భారత్‌లో ఒక్కరోజే 90 వేల కేసులు)

మరిన్ని వార్తలు