పాడెపై తల్లి.. తనయుల ఆస్తి లొల్లి

10 Dec, 2021 03:41 IST|Sakshi
మృతురాలి కొడుకులతో మాట్లాడుతున్న ఎస్సై  

జమ్మికుంట పట్టణంలో మంటకలిసిన మానవత్వం

పోలీసుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తి  

జమ్మికుంట: అనారోగ్యంతో తల్లి చనిపోతే అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన తనయులు శవాన్ని ఇంటిముందే ఉంచుకుని పంపకాల పంచాయితీ మొదలుపెట్టారు. కన్నతల్లి శవాన్ని కాటికి పంపక ముందే ఖర్చుల విషయంలో గొడవపడ్డారు. ఈ అమానవీయ ఘటనను చూడలేకపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలో నివసించే సూదం అనసూర్య (85)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు.

ఉపాధ్యాయుడిగా రిటైర్‌ అయిన భర్త రాజవీరు గతంలోనే చనిపోయారు. అప్పటినుంచి డిపెండెంట్‌ పింఛన్‌ అధారంగా అనసూర్య జీవనం సాగిస్తోంది. కొన్నినెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో జమ్మికుంటలోని చిన్నకొడుకు వద్ద ఉంటూ.. బుధవారం సాయంత్రం చనిపోయింది. వీణవంక మండలం గన్ముకులలో స్థిరపడిన మిగతా ముగ్గురు కొడుకులు జమ్మికుంటకు చేరుకున్నారు. తల్లి అంత్యక్రియలు, కర్మకాండలకు అయ్యే ఖర్చు, తల్లికి వస్తున్న పింఛన్, నివాసం ఉంటున్న ఇల్లు, ఇతర ఆస్తుల విషయం గురువారం నలుగురు కొడుకుల మధ్య గొడవకు దారితీసింది.

చిన్నకొడుకు మిగతా ముగ్గురిని అంత్యక్రియల తరువాత వెళ్లిపోవాలని సూచించడంతో నలుగురి మధ్య పంచాయితీ ఏర్పడింది. తల్లి మృతదేహాన్ని ఇంటిముందు ఉంచుకుని గొడవలేంటని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సతీశ్‌ అక్కడకు చేరుకుని మృతురాలి కుమారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కార్యక్రమం పూర్తిచేసేలా చూశారు.

మరిన్ని వార్తలు