తల్లి బాధ్యత భారం అనుకున్నారు!

5 Aug, 2020 09:58 IST|Sakshi
ఇంటి ఆరుబయట కమలమ్మ

70 ఏళ్ల వృద్ధురాలిని చూసేందుకు ఆసక్తి చూపని కుమారులు  

గోల్నాక జైస్వాల్‌గార్డెన్‌లో ఘటన 

అంబర్‌పేట: మాతృమూర్తిని కన్నపేగు కాదంది.... బాధ్యత గడువు ముగిసిందంటూ రోడ్డు పాల్జేయడంతో పక్షవాతంతో తల్లడిల్లుతున్న ఆ తల్లి నానా అవస్థలు పడింది.  ఈ హృదయ విదారకర ఘటన అంబర్‌పేట జైస్వాల్‌గార్డెన్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం.... గోల్నాక జైస్వాల్‌ గార్డెన్‌లో నివసించే కమలమ్మ(70), సత్యనారాయణ దంపతులు. వీరికి కుమారులు ఉదయ్, కృష్ణ, శివకుమార్, ఒక కూతురు ఉంది. కొద్ది కాలం క్రితం అనారోగ్యంతో సత్యనారాయణ మృతి చెందాడు.

ఆయన సంపాదించిన మూడు ఇళ్లను ముగ్గురు కుమారులకు, ఒక ఖాళీ స్థలాన్ని కుమార్తెకు పంచి ఇచ్చారు. సత్యనారాయణ మృతితో తల్లిని చూసుకునే విషయంలో కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో తల్లి చేసేది లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..  ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు ఒక్కో నెల తల్లిని చూసుకోవాలని, కుమార్తె నెలకు రూ.4 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను పెద్ద కుమారుడు పెద్దగా పట్టించుకోకపోగా,  ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో చిన్న కుమారుడు శివకుమార్‌ ఇంట్లో కమలమ్మ ఉంది. లాక్‌డౌన్‌ కావడంతో ఒక నెలకు బదులు మూడు నెలల పాటు అక్కడే ఉంది. జూన్‌ 1వ తేదీన  2వ కుమారుడైన కృష్ణ నివాసానికి తల్లిని పంపించాడు. కృష్ణ ఒక నెల తల్లిని చూసుకొని నెల గడువు ముగిసిందని తిరిగి చిన్న కుమారుడి ఇంటికి పంపించాడు.  

వాడులాడుకొని వదిలేశారు... 
లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలలు చూశాను. మీరు కూడా మూడు నెలలు చూడాలని చిన్న కుమారుడు అనడంతో సమస్య తలెత్తింది. రెండో కుమారుడు కృష్ణ కోర్టు సూచన మేరకు తాను ఒక నెల తల్లిని చూశానని వాదించాడు.  చివరకు ‘తల్లిని నువ్వు తీసుకెళ్లంటే.. నువ్వు తీసుకెళ్లు’ అని రోడ్డుపై వదిలేశారు. విషయం మీడియాకు, స్థానిక నేతలకు తెలియడంతో అప్రమత్తమైన   చిన్న కుమారుడు శివ తన కమలమ్మను ఇంట్లోకి తీసుకెళ్లడంతో స్థానికులు, తల్లి ఊరట చెందింది.

మరిన్ని వార్తలు