కొడుకులు కాదనుకున్నా..ఆశ్రమం చేరదీసింది

5 Feb, 2021 08:58 IST|Sakshi

తల్లిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు 

అమ్మఒడి ఆశ్రమంలో చేర్చిన స్థానికులు 

యాదగిరిగుట్ట: వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఆలనాపాలనా చూడాల్సిన కొడుకులు కర్కోటకులయ్యారు. నవ మాసాలు మోసి కని పెంచిందని కనీసం కనికరం లేకుండా వ్యవహరించారు. శివసత్తి శిగం ఊగుతుందని, కర్రలతో కొట్టి.. రోడ్డున పడేశారు. ఈ సంఘటన గురువారం యాదగిరిగుట్టలో వెలుగుచూసింది. వివరాలు.. హైదరాబాద్‌లోని సీతారామబాద్‌కు చెందిన యాదమ్మ (65), విఠల్‌ దంపతులకు ఐదుగురు కుమారులు ఉన్నారు. యాదమ్మ మంగళవారం, శనివారం శిగం ఊగుతుంటుంది. దీంతో భర్తతో పాటు కుమారులు, కోడళ్లకు ఇబ్బందిగా మారింది.

ఈ క్రమంలో రోజూ ఆమెను కొట్టడం, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవారు. చివరికి ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించారు. వారం క్రితం యాదగిరిగుట్టకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లారు. లక్ష్మీ సినిమా థియేటర్‌ సమీపంలో ఓ ఇంటి అరుగుపై అనారోగ్యంతో బాధపడుతున్న యాదమ్మను గమనించిన స్థానికులు.. వంగపల్లిలోని అమ్మఒడి అనాథ ఆశ్రమానికి పంపించారు. కుటుంబ సభ్యులు నిత్యం చిత్రహింసలకు గురిచేసేవారని యాదమ్మ తమతో చెప్పినట్లు ఆశ్రమ నిర్వాహకులు జెల్లా శంకర్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల పేరు ఎత్తితేనే ఆమె భయపడుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు