చిన్నారికి సోనూ సూద్‌ భరోసా

2 Oct, 2020 04:34 IST|Sakshi

బాలుడి లివర్‌ మార్పిడి చికిత్సకు సోనూసూద్‌ హామీ  

కదిలించిన ‘సాక్షి’కథనం 

డోర్నకల్‌: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్న సినీ నటుడు సోనూసూద్‌ను ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ఓ కథనం కదిలించింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన దేశబోయిన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్థన్‌ (06) లివర్‌ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఆయనకు లివర్‌ మార్పిడి చేయాలని, ఇందుకోసం రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని గత నెల 22న ‘సాక్షి’వరంగల్‌ టాబ్లాయిడ్‌లో ‘చిన్న వయస్సు.. పెద్ద జబ్బు’ఆరేళ్ల బాలుడికి లివర్‌ సమస్య’శీర్షికన కథనం ప్రచురితమైంది. అయితే, మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్‌ తండ్రి నాగరాజు అంత మొత్తం వెచ్చించలేని పరిస్థితి ఉంది. తన సహచర ఉద్యోగులు రూ.2 లక్షల వరకు సమకూర్చారు.

అయినా హర్షవర్ధన్‌ చికిత్సకు పెద్ద ఎత్తున డబ్బు అవసరముంది. దీంతో మహబూబాబాద్‌ డిపో కండక్టర్ల ఐక్య వేదిక ఆధ్వర్యాన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతులు గురువారం హైదరాబాద్‌లో షూటింగ్‌కు వచ్చిన సినీ నటుడు సోనూసూద్‌ను కలిశారు. హర్షవర్థన్‌ ఆరోగ్య పరిస్థితిని వివరించడంతో పాటు ‘సాక్షి’క్లిప్పింగ్‌ను ఇవ్వగా, అక్కడే ఉన్న నటులు బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి తెలుగు కథనాన్ని సోనూసూద్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. హర్షవర్ధన్‌ లివర్‌ మార్పిడి కోసం జరిగే శస్త్రచికిత్స అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే అపోలో ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి అవసరమైన వైద్యసాయం అందించాలని సోనూసూద్‌ కోరారు. దీంతో హర్షవర్థన్‌ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీలక్ష్మి, ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు