విమానం టికెట్‌తో అంతరిక్షానికి!

30 Nov, 2022 02:15 IST|Sakshi
మాట్లాడుతున్న పవన్‌ కుమార్‌. చిత్రంలో గుంటుపల్లి పవన్‌ 

మరో పదేళ్లలో అది సాధ్యమే..

స్కై రూట్‌ సహ వ్యవస్థాపకుడు పవన్‌కుమార్‌ చందన

సాక్షి, హైదరాబాద్‌: విమానం టికెట్‌తో అంతరిక్షంలోకి ప్రయాణించే రోజులు ఎంతో దూరంలో లేవని, మరో పదేళ్లలోనే అది సాధ్యమవుతుందని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సహ వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌ చందన అన్నారు. రాకెట్ల నిర్మాణానికి హైదరాబాద్‌ నగరం అన్ని రకాలుగా అనుకూలమైందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్‌ రంగంలో రాకెట్‌ను తయారు చేసిన సంస్థ స్కైరూట్‌ అనే విషయం తెలిసిందే.

ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే అంతరిక్షానికి ఎగిరిన తమ రాకెట్‌ పూర్తిగా హైదరాబాద్‌లోనే తయారైందని, అది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైనదని పేర్కొన్నారు. సొంతంగా ఉపగ్రహాలను తయారు చేసుకోగల సామర్థ్యం చాలా కొద్దిదేశాలకే ఉందని, భారత్‌ ఈ రంగంలో ఇప్పటికే ముందు వరసలో ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ కూడా అంతరిక్ష రంగంలో ఓ ప్రధానకేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా వంద నుంచి 150 ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంటే, రానున్న పదేళ్లలో వీటి సంఖ్య పదివేలకు తరువాతి పదేళ్లలో 40 వేలకూ చేరుకుంటుందని చెప్పారు. అంతరిక్షంలో విహారయాత్రలకు పాశ్చాత్య దేశాలు సిద్ధమవుతున్నాయని, భారత్‌లోనూ ఇంకో పదేళ్లకు ఇది సాధ్యం కావచ్చని పవన్‌కుమార్‌ తెలిపారు.

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రస్తుతానికి ఈ అంశంపై దృష్టి పెట్టడంలేదన్నారు. స్కై రూట్‌ ఏరోస్పేస్‌ తయారు చేస్తున్న రాకెట్‌ ‘విక్రాంత్‌ 1’ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదని, దీని ప్రయోగం వచ్చే ఏడాది జరగవచ్చని తెలిపారు. ఇప్పటివరకూ రాకెట్ల ద్వారా గరిష్టంగా పదిమంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుందని, ఎక్కువ మందితో ప్రయాణించే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం  
దేశంలో అంతరిక్ష పరిజ్ఞానం వృద్ధిలో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతైనా ఉందని, స్టార్టప్‌ కంపెనీలు ధ్రువ స్పేస్, స్కై రూట్‌ ఏరోస్పేస్‌లు హైదరాబాద్‌లో ఉండటం, రాకెట్‌ ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట ఏపీలో ఉండటాన్ని పవన్‌కుమార్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏరోస్పేస్‌ రంగంలో ఇప్పటికీ మహిళల భాగస్వామ్యం పదిశాతం మాత్రమే ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ కల్పనా చావ్లా స్ఫూర్తితో మరింతమంది ఈ రంగంలోకి ప్రవేశించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాలసీ బజార్‌ వైస్‌ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అలోక్‌ బన్సర్, రాపిడో బైక్‌ షేరింగ్‌ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన గుంటుపల్లి పవన్‌ తదితరులు కూడా స్టార్టప్‌ రంగంలో తమ అనుభవాలను పంచుకున్నారు.

మరిన్ని వార్తలు