ప్రయాణికులు, రైల్వే ఆస్తుల పరిరక్షణపై దృష్టి

18 Apr, 2022 20:14 IST|Sakshi

‘మిషన్‌ జీవన్‌ రక్ష’తో ప్రమాదాల నియంత్రణ

వీధి బాలలకు ‘నాన్హే ఫరిస్తే’తో భరోసా

మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక నిఘా

కార్యాచరణకు శ్రీకారం చుట్టిన ద.మ.రై

సాక్షి, హైదరాబాద్‌: రైల్వేతో పాటు ప్రయాణికుల ఆస్తుల పరిరక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ప్రస్తుత వేసవిలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటం, పెద్దఎత్తున సరుకు రవాణా రైళ్ల రాకపోకలు.. ప్రధాన రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముంది. దొంగలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే నేరస్తులతో సహా అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అరికట్టేందుకు ఆర్‌పీఎఫ్‌ పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. రైల్వే ఆస్తుల రక్షణతో పాటు, ప్రయాణికుల భద్రత కోసం రాష్ట్ర పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.  

ప్రయాణంలో ప్రమాదాలు... 
రైలు పట్టాలే మృత్యుపాశాలుగా మారుతున్నాయి. జీవితంపై విరక్తితో కొందరు ఆత్మహత్యల కోసం పట్టాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్లలో పట్టాల మీదుగా ఒక ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు దాటుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతుండగా, కదిలే రైలు ఎక్కడం వల్ల, లేదా రైలు స్టేషన్‌లో పూర్తిగా ఆగకుండానే దిగేందుకు ప్రయత్నిస్తూ మరికొందరు పట్టాలపైకి జారి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నియంత్రణలో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తత వల్ల  కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. ‘మిషన్‌ జీవన్‌ రక్ష’ కింద ఈ ఏడాది మార్చి నెలలో 13 మంది పురుషులు, 8 మంది మహిళలను కాపాడినట్లు అధికారులు తెలిపారు.  

బాలలకు  భరోసా.. 
వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి రైళ్లెక్కే చిన్నారులకు రైల్వేస్టేషన్‌లే అడ్డాలుగా మారుతున్నాయి. తెలిసీ తెలియక రైళ్లలో దూర ప్రాంతాలకో చేరుకొని అసాంఘిక శక్తుల చేతుల్లో పడుతున్న పిల్లలు వీధి బాలలుగా మారి చివరకు నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పిల్లల రక్షణ కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి.  

► రైల్వేస్టేషన్‌లలో బాలల రక్షణ కోసం పని చేసే  సహాయ కేంద్రాలకు ఆర్‌పీఎఫ్‌ బాసటగా నిలు స్తోంది. ‘ఆపరేషన్‌ నాన్హే ఫరిస్తే’ పథకంలో భా గంగా ఇల్లు వదిలి తప్పిపోయి, లేదా పారిపోయి వచ్చిన 93  మంది పిల్లలను ఆర్‌పీఎఫ్‌ దళాలు కాపాడాయి. వారిలో  66 మంది అబ్బాయిలు, మరో 27 మంది అమ్మాయిలు ఉన్నారు.

► ‘ఆపరేషన్‌ డిగ్నిటీ’ కార్యక్రమంలో భాగంగా  నిరాశ్రయులు, నిస్సహాయులు, మతిస్థిమితం లేనివారు, అక్రమ రవాణాకు గురయ్యే వాళ్లను గుర్తించి రక్షించారు. అలాంటి వారిని తిరిగి కుటుంబాలకు అప్పగించారు. అయిదుగురు పురుషులతో పాటు  10 మంది మహిళలను కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణంలో వైద్య సహాయం అవసరమైన 59 మందిని ఆర్‌పీఎఫ్‌  దళాలు  సత్వరమే  చేరుకొని ఆస్పత్రులకు తరలించాయి.    

అక్రమ రవాణాపై ఉక్కుపాదం... 
► రైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఆర్‌పీఎఫ్‌ ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్‌ నార్కో స్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.గత నెలలో  రూ.7.50 లక్షలకు పైగా విలువైన మాదకద్రవ్యాల ఉత్పత్తులను జప్తు చేసి, ఆరుగురు వ్యక్తుల ను అరెస్టు చేశారు. ఆపరేషన్‌ సట్కార్క్‌’లో భాగంగా  రూ.1.97 లక్షల విలువైన అక్రమ  మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆరుగురిని అరెస్టు చేసి ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు