Retiring Rooms: రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌..

15 May, 2022 07:39 IST|Sakshi

రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు విశ్రాంతి గదులు 

2 నుంచి 48 గంటల పాటు వేచి ఉండొచ్చు 

టికెట్‌తో పాటు గదుల బుకింగ్‌ సదుపాయం 

పర్యాటకులు, దూరప్రాంతాలవారికి ప్రయోజనం 

సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో సేవల పునరుద్ధరణ

సాక్షి, హైదరాబాద్‌: మీరు గంటల తరబడి ప్రయాణం చేసి అలసిపోయారా? ఓ రెండు గంటల పాటు విశ్రాంతి కోసం ఎదురుచూస్తున్నారా? మరేం ఫరవాలేదు. రైల్వేస్టేషన్లలోనే ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు. రెండు గంటలే కాదు. రెండు రోజులు కూడా  ఉండిపోవచ్చు. చక్కటి సదుపాయాలతో  విశ్రాంతి గదులు సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం నగరానికి వచ్చే ప్రయాణికులు, సిటీటూర్‌ కోసం వచ్చేవారు ఏ హోటల్లోనో బస చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలతో కూడిన రైల్వేస్టేషన్లలోనే ఉండేందుకు అనుగుణంగా దక్షిణమధ్య రైల్వే రిటైరింగ్‌ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌లలో సుమారు 30 విశాలమైన విశ్రాంతి గదులు, డార్మిటరీలను  ప్రయాణికుల కోసం కేటాయించారు. వేసవి పర్యటనల  కోసం నగరానికి వచ్చే పర్యాటకులతో ఈ గదులకు అనూహ్యమైన డిమాండ్‌ ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి  ఒకరు తెలిపారు. స్టార్‌హోటళ్లు, లాడ్జీల కంటే తక్కువ ధరలకే  లభించడంతో  డిమాండ్‌ నెలకొన్నట్లు పేర్కొన్నారు.  

సిటీ టూర్‌.. సో బెటర్‌.. 
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 2 లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన పర్యటనలు తిరిగి మొదలయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి  దక్షిణాది పర్యటనకు వెళ్లేవారు హైదరాబాద్‌ను విడిదిగా ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా తిరుపతి తదితర పుణ్య క్షేత్రాలకు వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో సిటీటూర్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఇంటిల్లిపాదీ కలిసి పరిచయం లేని ప్రాంతాల్లో ఉండడం కంటే భద్రత దృష్ట్యా  రైల్వేస్టేషన్‌లనే ఎంపిక చేసుకుంటున్నట్లు  అధికారులు  తెలిపారు.  

24 నుంచి 48 గంటల వరకు బుకింగ్‌లు  ఎక్కువగా ఉన్నాయి. రెండు, మూడు గంటల పాటు విశ్రాంతి కోసం కూడా గదులను  తీసుకోవచ్చు. వ్యాపార అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పని చేసే  ఉద్యోగులు కూడా విధినిర్వహణలో భాగంగా రైళ్లలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటించవలసి వచ్చినప్పుడు రిటైరింగ్‌ రూమ్‌లను, డార్మిటరీలకు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. 

ఏసీ, నాన్‌ ఏసీ  సదుపాయంతో కూడిన ఈ గదుల్లో పడకలు, స్నానాల గదులు, టీవీ, తాగునీరు వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఐఆర్‌టీసీ  ఈ గదులను నిర్వహిస్తుంది. రైల్వేస్టేషన్‌లలో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ వంటి భద్రతా బలగాల పర్యవేక్షణ ఉంటుంది.  ప్రయాణికులు నిశ్చింతంగా  ఉండవచ్చు. 

నిర్ధారిత టిక్కెట్‌ తప్పనిసరి.. 
విశ్రాంతి గదులను అద్దెకు తీసుకొనేందుకు  ప్రయాణికులు  నిర్ధారిత టికెట్‌ను కలిగి ఉండాలి. టికెట్‌ బుకింగ్‌ సమయంలోనే రిటైరింగ్‌ రూమ్‌ బుక్‌ చేసుకోవచ్చు. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా బుకింగ్‌ సదుపాయం ఉంటుంది. కానీ  నిర్ధారిత టిక్కెట్‌ ఉండాలి. ప్రయాణ తేదీకి అనుగుణంగానే విశ్రాంతి గదుల సదుపాయం లభిస్తుంది.   

మరిన్ని వార్తలు