నేటి నుంచి ప్యాసింజర్‌ రైళ్లు షురూ..

19 Jul, 2021 07:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌ : గతేడాది కోవిడ్‌ తొలిదశ లాక్‌డౌన్‌ సందర్భంగా మార్చినెలాఖరులో నిలిపివేసిన రైళ్లను సోమవారం నుంచి పున:ప్రారంభించేందుకు దక్షిణ మధ్యరైల్వే చర్యలు చేపట్టింది. దాదాపు 16నెలల సుదీర్ఘ విరామం అనంతరం దశలవారీగా రైళ్లను నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే కరీంనగర్‌– తిరుపతి ప్రత్యేక రైలు వారంలో రెండు పర్యాయాలు గురు, ఆదివారాల్లో నడుస్తుండగా సోమవారం నుంచి కాచిగూడ – కరీంనగర్‌ ప్యాసింజర్‌ రైలు ప్రారంభమవుతుంది.

సోమవారం ఉదయం 6గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్‌ మీదుగా మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి మరుసటిరోజు 20న మధ్యాహ్నం 2.20గంటలకు కరీంనగర్‌ నుంచి బయల్దేరి రాత్రి 11గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ నెల 20న ఉదయం 8గంటలకు కరీంనగర్‌ నుంచి పుష్‌పుల్‌ రైలు బయల్దేరి పెద్దపల్లికి 8.30 గంటలకు చేరుకుంటుంది. పెద్దపల్లి నుంచి మధ్యాహ్నం 1గంటకు బయల్దేరి కరీంనగర్‌కు 1.45గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ మేనేజరు ప్రసాద్‌ కోరారు. 

మరిన్ని వార్తలు