South Central Railway: ఊపిరందించిన 100 రైళ్లు

5 Jul, 2021 14:11 IST|Sakshi

2 నెలల్లో 7,684 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా 

తెలుగు రాష్ట్రాలకు సప్లైచైన్‌ నడిపిన దక్షిణమధ్య రైల్వే 

ఎక్కడా ఆటంకం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ 

తెలంగాణకు 4,055 మెట్రిక్‌ టన్నులు 

ఏపీకి 3,628 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆ రైళ్లు ఆగమేఘాల మీద ‘ఊపిరి’ని మోసుకొచ్చాయి. వందలాది మంది కోవిడ్‌ బాధితులకు ప్రాణవాయువును అందించాయి. మహమ్మారి రెండో వేవ్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దక్షిణమధ్య రైల్వే నిరాటంకంగా ఆక్సిజన్‌ సప్లై చైన్‌ నడిపింది. ఇప్పటివరకు 100 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆక్సిజన్‌ను సరఫరా చేశాయి. వీటి ద్వారా మొత్తం 7684.29 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ తెలుగు రాష్ట్రాలకు అందింది. ఈ నెల 2 నాటికి తెలంగాణకు 4,055.97 మెట్రిక్‌ టన్నులు, ఏపీకి 3,628.32 మెట్రిక్‌ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ సరఫరా అయ్యింది.

సుమారు 2 నెలలకు పైగా విజయవంతంగా కొనసాగిన ఈ సరఫరా చైన్‌ ద్వారా తెలంగాణ, ఏపీల్లోని అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్‌ కొరత తీరింది. 431 ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా జరిగింది. ప్రధానంగా ఒడిశా నుంచి 3,838.69 మెట్రిక్‌ టన్నులు, గుజరాత్‌ నుంచి 1,793.10 మెట్రిక్‌ టన్నులు, జార్ఖండ్‌ నుంచి 1,288 మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 684.5 మెట్రిక్‌ టన్నులు, పశ్చిమ బెంగాల్‌ నుంచి 80 మెట్రిక్‌ టన్నుల చొప్పున వచి్చంది. 

గ్రీన్‌ కారిడార్లలో పరుగులు 
ఆక్సిజన్‌ రైళ్ల నిర్వహణలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఈ రైళ్లను నడిపేందుకు ఎంపిక చేసిన 40 మంది లోకో పైలెట్‌లు, లోకో ఇన్‌స్పెక్టర్లు తదితర సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణనిచ్చారు. సప్లైచైన్‌కు ఎలాంటి విఘాతం కలగకుండా సిగ్నలింగ్, ఆపరేషన్స్‌ విభాగాలు ప్రత్యేక శ్రద్ధను చూపాయి. ఈ రైళ్లు మొదట్లో ఎక్కువ ప్రయాణ సమయం తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా గ్రీన్‌ కారిడార్‌లు ఏర్పాటు చేశారు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా సరే వీలైనంత తక్కువ సమయంలో రైళ్లు హైదరాబాద్, గుంటూరులకు చేరుకొనే విధంగా చర్యలు చేపట్టారు.మరోవైపు ఈ రైళ్లను పర్యవేక్షించేందుకు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ విభాగాలతో సమన్వయ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. 

అంకిత భావంతో పని చేశారు: జీఎం గజానన్‌ మాల్యా
తెలుగు రాష్ట్రాలకు వేగంగా, సమర్థంగా ఆక్సిజన్‌ రైళ్లను నడపడంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు అంకిత భావంతో పని చేశారని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా అభినందించారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఇదే తరహాలో రైళ్లను నడుపనున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు