‘గరుడ’ భారీ గూడ్స్‌ రైలు 

11 Oct, 2021 04:19 IST|Sakshi

రెండు కిలోమీటర్ల పొడవు.. 177 వ్యాగన్లు.. 

ఒకేసారి 12,000 టన్నుల బొగ్గు తరలింపు

దక్షిణ మధ్య రైల్వేలో తొలి భారీ బొగ్గు రవాణా రైలు

సాక్షి, హైదరాబాద్‌: ‘గరుడ’... పేరుకు తగ్గట్టుగానే సూపర్‌ స్పీడ్, రెండు కిలోమీటర్ల పొడవైన భారీ రైలు. దక్షిణ మధ్య రైల్వే తొలి భారీ సరుకు రవాణా రైలు. జాప్యాన్ని నివారించడం, భారీ సరుకు రవాణా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పని... లక్ష్యంగా రైళ్లను నడపాలన్న సంస్థ ప్రయత్నాలు ఫలించాయి. ప్రయోగాత్మకంగా 8–10 తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి బొగ్గు రవాణాకు ఈ రైలును వినియోగించారు. రాయచూరు నుంచి మణుగూరుకు వచ్చి బొగ్గు లోడ్‌ చేసుకుని పరుగులు పెట్టిందీ రైలు.

త్రిశూల్‌ పేరుతో మరోరైలును అంతకుముందు రోజే విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి – ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లోని ఖుద్ర డివిజన్‌కు నడిపారు. సరుకు రవాణాలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే... సరుకు రవాణాను మరింత వేగవంతం చేసే ప్రయత్నంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మామూలు సరుకు రవాణా రైళ్లు మూడింటిని జోడించటం ద్వారా రెండు కిలోమీటర్ల పొడవుండే ఈ భారీ రైలును రూపొందించి నడుపుతున్నారు. ఒకేసారి మూడు రైళ్ల లోడు తరలిపోతుంది. దీంతో రైలుకు రైలు మధ్య సిగ్నళ్లు, ఇతర సమస్యలతో ఏర్పడే విరామం తగ్గి సరుకు వేగంగా తరలటం, ఖాళీ వ్యాగన్లు వేగంగా మళ్లీ గమ్యం చేరుకోవటం వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.    

మరిన్ని వార్తలు