ప్రొటీన్‌.. హైదరాబాద్.. మనమే టాప్‌‌!

23 Jan, 2021 18:20 IST|Sakshi

భాగ్యనగరవాసులకు  ప్రొటీన్‌ అవగాహన ఎక్కువ

మిగిలిన మెట్రోలకన్నా.. మనమే మెరుగు

సౌతిండియా ప్రొటీన్‌ గ్యాప్‌ సర్వే ఫలితాల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాళ్లలో అవసరం. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా రోగ నిరోధక శక్తికి కావాల్సిన ప్రొటీన్లు శరీరానికి అందడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ‘సౌత్‌ ఇండియా ప్రొటీన్‌ గ్యాప్‌’ పేరిట నిర్వహించిన సర్వేలో ప్రొటీన్లపై మన హైదరాబాదీలకు మెరుగైన అవగాహన ఉందని తేల్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రొటీన్‌పై అవగాహనకు సంబంధించి ఈ సర్వే నిర్వహించారు. 

సిటీ టాప్‌...
పాలు తీసుకోని వారిలో 83 శాతం మంది ప్రోటీన్‌ లోపంతో బాధపడుతున్నారని నగరానికి చెందిన ఓ డెయిరీ ప్రొడక్ట్‌ నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. అలాగే 68 శాతం మందిలో రోజువారీగా శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ పరిమాణంపై అవగాహన లేదు. ఈ సర్వేలో పాల్గొన్న హైదరాబాదీల్లో 68 శాతం మంది రోజువారీగా తమకు ఎంత ప్రొటీన్‌ అవసరం అనేది చెప్పగలిగారు. అదే చెన్నై విషయానికి వస్తే 25 శాతం మందిలోనే ఈ విషయంలో అవగాహన ఉంది. ఇక 5 శాతంతో బెంగుళూర్‌వాసులు ప్రొటీన్‌పై అవగాహనతో మరీ వెనుకబడ్డారు. (చదవండి: ఏడాదికి రాష్ట్ర ప్రజలు తింటున్న కోడికూర లెక్క ఇదీ!)

లో‘పాలూ’కారణమే...
రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో ప్రొటీన్లది కీలకపాత్ర. ఒక పురుషునికి రోజుకు 56 గ్రాముల ప్రొటీన్లు అవసరం. అదే మహిళకైతే 46 గ్రాములు కావాలి. రోజుకు ఒక వ్యక్తి 400–500 మి.లీ. పాల ఉత్పత్తులు తీసుకుంటే అవి అవసరమైన ప్రొటీన్‌ను అందిస్తాయి. ప్రపంచంలోనే పాల ఉత్పత్తుల్లో భారత్‌ అతి పెద్దదిగా పేరు పొందినా.. పెద్దల్లో 32% మందే పాలు తీసుకుంటారు. సర్వే ప్రకారం.. 54% మంది పెద్దల్లో ప్రొటీన్‌ లోపం ఉండగా, శాకాహారుల్లో ఇది 62%గా ఉంది.

మరిన్ని వార్తలు