‘సామాన్యుడి రైలు బండి’ ఇప్పట్లో కదిలేనా?

8 Jul, 2021 18:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మూడో వేవ్‌తో ప్యాసింజర్‌ రైళ్లకు ముడి

సరిగ్గా.. పట్టాలెక్కే వేళ కోవిడ్‌ హెచ్చరికలు

వాటిని ప్రారంభిస్తే రద్దీని నియంత్రించలేమని కేంద్రానికి రైల్వేబోర్డు సూచన

వైద్య శాఖ సలహా మేరకు తుది నిర్ణయం తీసుకునే వీలు 

సాక్షి, హైదరాబాద్‌: చరిత్రలో ఎన్నడూ లేనట్టు 16 నెలల పాటు నిలిచిపోయే ఉన్న ‘సామాన్యుడి రైళ్ల’ను ప్రారంభించేందుకు సిద్ధమైన రైల్వే బోర్డు మళ్లీ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కోవిడ్‌ రెండో దశ దాదాపు తగ్గిపోవడంతో సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభం అయ్యే వేళ ప్యాసింజర్‌ రైళ్లకు ఇప్పుడు కోవిడ్‌ మూడో వేవ్‌ హెచ్చరికలు అడ్డుపడనున్నాయి. కోవిడ్‌ కేసులు మళ్లీ పెరిగితే.. నిత్యం రద్దీతో పరుగుపెట్టే ప్యాసింజర్‌ రైళ్లు సూపర్‌ స్ప్రెడర్లుగా మారతాయన్న భయం వ్యక్తమవుతోంది. ప్యాసింజర్‌ రైళ్లలో రద్దీని నియంత్రించడం సాధ్యంకాదని తాజాగా రైల్వే బోర్డు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని సమాచారం. వీటిని ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని జోన్‌ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. 

రద్దీని నియంత్రించే వీలులేక.. 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 220 ప్యాసింజర్‌ రైళ్లు తిరుగుతాయి. వీటిల్లో 90 శాతం రైళ్లు తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగేవి కాగా, మిగతావి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులకు రాకపోకలు సాగిస్తాయి. ఇటీవల ప్రారంభించిన ఎంఎంటీఎస్‌ రైళ్లతో పరిస్థితిని అంచనా వేసి వీటిని జూలై రెండో వారం నాటికి ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ ఈ లోగా కోవిడ్‌ మూడో వేవ్‌ హెచ్చరికలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు స్వీయ నిర్ణయంతో రాష్ట్రాల మధ్య బస్సులు, ఇతర రవాణా సర్వీసులను నిలిపేస్తున్నాయి. రైల్వే వాటి పరిధిలో లేనందువల్ల రైళ్లలో రాకపోకలు సాగుతూనే ఉంటాయి. 

అయితే ప్యాసింజర్‌ రైళ్లలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే ఎక్కువ హాల్టులు ఉండటం, అన్‌రిజర్వ్‌డ్‌ విధానం అమలు వల్ల ప్రయాణికుల రద్దీని నియంత్రించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో.. కేంద్రానికి రైల్వే బోర్డు తన అభిప్రాయాన్ని తెలిపినట్టు సమాచారం. దీంతో వైద్య శాఖ సలహాలు తీసుకుని కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. దేశవ్యాప్తంగా రోజువారీ కోవిడ్‌ కేసులు బాగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే ఉంటే ఇది మూడో వేవ్‌గా మారుతుందన్న అభిప్రాయం నేపథ్యంలో.. ప్యాసింజర్‌ రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. 

మరిన్ని వార్తలు