Monsoon: నైరుతి వచ్చేసింది! 

6 Jun, 2021 03:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు 

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు విస్తరణ 

రుతుపవనాలు చురుకుగా కదలడంతో విస్తరణలోనూ వేగమే 

సాక్షి, హైదరాబాద్‌: ‘నైరుతి’రాష్ట్రాన్ని పలకరించింది. ఈ నెల 3న కేరళను తాకిన రుతుపవనాలు.. చురుకుగా ముందుకు వస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా రాష్ట్రం వైపు వ్యాపిస్తున్నాయి. శనివారం రాష్ట్రంలోని నైరుతి దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు రాష్ట్రంలోని చాలాచోట్ల విస్తరించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటక తీరం, గోవా అంతటా, మహారాష్ట్రలోని కొంత భాగం వరకు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాగే ఉత్తర కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

రెండ్రోజులు తేలికపాటి వర్షాలు.. 
రాష్ట్రానికి నైరుతి దిక్కు నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు కురిశాయి. సగటున సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు మినహాయిస్తే మిగతా అంతటా వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో అత్యధికంగా 8.75 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.  

కాస్త ముందే... 
ఈ ఏడాది నైరుతి రుతపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. గతేడాది జూన్‌1న కేరళలోకి ప్రవేశించిన నైరుతి క్రమంగా విస్తరిస్తూ జూన్‌ 11న రాష్ట్రానికి చేరుకుంది. ఈ ఏడాది మే 30న కేరళకు చేరుకుంటాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసి... క్రమంగా మే 31 నాటికి వస్తాయని ప్రకటించింది. చివరకు మరింత లోతైన అంచనాలతో జూన్‌ 3న కేరళను తాకుతాయని పేర్కొంది. ఈ మేరకు నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలులతో రుతుపవనాల రాక కనిపించింది. అనంతరం రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగడం... రాష్ట్రానికి నైరుతి దిశ నుంచి కిందిస్థాయి గాలుల తీవ్రత ఎక్కువవడంతో రెండ్రోజుల్లోనే రాష్ట్రాన్ని పలకరించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆరు రోజుల ముందే రాష్ట్రాన్ని చేరుకోవడం గమనార్హం.    

మరిన్ని వార్తలు