24 గంటల్లో ‘నైరుతి’ వెనక్కి

28 Sep, 2020 04:04 IST|Sakshi

పశ్చిమ రాజస్తాన్, పరిసర ప్రాంతాల్లో అనుకూల పరిస్థితులు

తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ రాజస్తాన్, పరిసర ప్రాంతాల్లో ఇందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలి పింది. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి ప్రభా వంతో దాదాపు మూడున్నర నెలలపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వర్షాలు కురవడంతో 90 శాతానికి పైగా చెరువులు నిండాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థి తులు ఏర్పడటంతో సోమవారా నికల్లా ఇవి పశ్చిమ రాజస్తాన్, పరిసర ప్రాంతాల్లో నిష్క్రమించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

107 సెం.మీ. వర్షపాతం..
వర్షాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా 70.7 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఈసారి ఏకంగా 107.0 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. జూన్‌ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించగా... అప్పట్నుంచి ప్రతి నెలలో కూడా సాధారణ వర్ష పాతం కంటే అధికంగా వానలు కురిశాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ లలో సాధారణం కంటే రెట్టింపు వానలు కురవడంతో రికార్డు స్థాయిలో ప్రాజెక్టులు నిండి గేట్లు తెరుచుకున్నాయి. గతేడాదిఇదే సీజన్‌లో కేవలం 77.6 సెంటీమీటర్ల వర్షం కురిసి సాధారణ వర్షపాతాన్ని నమోదు చేసింది.

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి...
దక్షిణ ఆంధ్రప్రదేశ్లో సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తూర్పు బిహార్, దాన్ని ఆనుకొని ఉన్న సబ్‌ హిమాలయన్‌ పశ్చిమ బెంగాల్‌ వైపు కొనసాగుతోంది. అదేవిధంగా సిక్కింలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పశ్చిమ బెంగాల్, కోస్తా ఒడిశా మీదుగా సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.

మరిన్ని వార్తలు