Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్‌

31 Jul, 2022 12:36 IST|Sakshi

Basara IIIT.. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా ట్రిపుల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బీజేపీ నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ట్రిపుల్‌ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల కిత్రం బాసర ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు.

తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టడంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ‍్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని పట్టబట్టారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. 

ఇది కూడా చదవండి: ‘రామగుండం’లో కొలువుల స్కాం!

మరిన్ని వార్తలు