సోయా విత్తనానికి.. మహారాష్ట్రకు పరుగులు

28 Jun, 2021 08:06 IST|Sakshi

నిలిచిపోయిన రాయితీ... దళారుల ఇష్టారాజ్యం 

అన్నదాత నెత్తిన సోయా విత్తన భారం 

రాష్ట్రంలో కొరతతో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్న ఇక్కడి వ్యాపారులు 

సాక్షి, హైదరాబాద్‌: సోయాబీన్‌ విత్తనం కోసం రైతులు మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. పెద్ద ఎత్తున విత్తన కొరత ఏర్పడటంతో ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత ధరైతే అంతకు కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా సోయాబీన్‌ విత్తనాన్ని ఈసారి వ్యవసాయ శాఖ సరఫరా చేయలేకపోయింది. ఫలితంగా రైతులకు విత్తనం దొరకలేదు.. రాయితీ కూడా అందలేదు. దీన్ని అదనుగా తీసుకొని వ్యాపారులు, దళారులు దగా చేస్తున్నారు. దీంతో సోయాబీన్‌ సాగు చేసే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్రమేంటంటే వ్యవసాయ శాఖకు విత్తనం దొరక్క పోగా, వ్యాపారులకు మాత్రం అది అందుబాటులో ఉంటోంది.  

నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాగు... 
తెలంగాణలో ఈసారి వానాకాలం సీజన్‌లో సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు 18,112 (4 శాతం) ఎకరాల్లో సాగు చేశారని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు సోయాను సాగు చేస్తారు. రాష్ట్రానికి అవసరమైన సోయా విత్తనాల్లో 1.20 లక్షల క్వింటాళ్ల వరకు ప్రతీ ఏడాది ప్రభుత్వమే సమకూర్చుతుంది. కొన్ని రకాల వెరైటీ విత్తనాలను రైతులు ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తారు.

ఈసారి ఇతర రాష్ట్రాల్లోనూ అధిక వర్షాలతో సోయా విత్తన పంట దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ సోయా విత్తనం ఇతర ప్రాంతాలకు విక్రయించకూడదని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించడంతో తెలంగాణ వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. టెండర్లు వేసినా కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో రైతులే సమకూర్చు కోవాలని, లేకుంటే ప్రత్యామ్నాయంగా పత్తి, కంది వంటి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. ఆ పంటకే అలవాటు పడటంతో చాలామంది రైతులు సోయాబీన్‌ విత్తనాల కోసం మహారాష్ట్రకు పరుగులు తీస్తున్నారు.  

సబ్సిడీ లేకపోవడంతో.. 
గతేడాది సోయా విత్తనాలు క్వింటాలుకు రూ. 6,645 ఉండగా, రూ. 2,701 సబ్సిడీ వచ్చేది. రూ.3,944 రైతు తన వాటాగా చెల్లించేవాడు. ఎకరానికి 30 కిలోల వరకు విత్తనాలు విత్తుకునేవారు. 30 కిలోల బస్తాను సబ్సిడీపై రైతులకు అందించేవారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయకపోవడంతో మార్కెట్‌లో వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు విత్తనాల ధర రూ. 13 వేల వరకు ఉంది. 27 కిలోల బస్తా ధర రూ.3,500 వరకు చెల్లించి రైతులు కొంటున్నారు.

నానా తిప్పలు పడ్డాను
నేను 16 ఎకరాలు సోయా సాగు చేస్తున్నాను. ఇక్కడ సోయా విత్తనాలు సరఫరా చేయకపోవడంతో నాందేడ్‌ నుంచి తెచ్చుకు న్నా. బస్తా (30 కిలోలు) రూ.3,300 చొప్పున కొన్నాను. విత్తనాలు కొనుగోలు చేసేందుకే నానా తిప్పలు పడ్డాను. తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్రలో రెట్టింపు ధరకు దొరికాయి. ప్రభుత్వమే సబ్సిడీపై ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.    – చిద్రపు అశోక్, ఖాజాపూర్, నిజామాబాద్‌ 

విత్తనాలకే రూ.25వేలు ఖర్చు..
నేను 5 ఎకరాల్లో సోయాబీన్‌ వేశా. ప్రతిసారి ప్రభుత్వమిచ్చే సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేసేవాన్ని. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడంతో మార్కెట్‌లో వ్యాపారులు ధరలు పెంచేశారు. ఏడు బస్తాల సోయా విత్తనాలను కొనుగోలు చేశాను. ఒక్కో బస్తా రూ. 3,600లకు తెచ్చి విత్తుకున్నాను. విత్తనాల కోసమే రూ. 25 వేలు వెచ్చించాల్సి వచ్చింది.     --- కుంట రంజిత్‌రెడ్డి, నల్లవెల్లి, నిజామాబాద్‌  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు