‘పోడు’పై వాయిదా తీర్మానం తిరస్కరణ

6 Oct, 2021 03:28 IST|Sakshi

సభలో చర్చించాలంటూ స్పీకర్‌ను కలసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేలు 

నిరాకరించిన పోచారం... గన్‌పార్కు వద్ద ఎమ్మెల్యేల నిరసన 

నిరంకుశ విధానాలు మానుకోకపోతే తిరుగుబాటు తప్పదన్న భట్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం సభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలసి పోడు సమస్యలపై సభలో చర్చ జరపాలని కోరారు. అయినా ఫలితం లేకపోవడం మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో గన్‌పార్కు వద్దకు వచ్చి నిరసనను తెలియజేశారు.

ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. అడవుల్లో నివసించే వారికి తమ హయాంలో భూములపై హక్కులు కల్పించామని, తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్‌ ప్రభుత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. పోడు వ్యవసాయం చేసే అడవిబిడ్డలను పోలీసులు కొట్టి అరెస్టు చేయడం నిత్యకృత్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని తాము అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చినా తిరస్కరించారని, దీనిపై స్పీకర్‌ను కలిసి నిరసన తెలిపామని చెప్పారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకోవాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య మాట్లాడుతూ గిరిజన పోడు భూములపై ఇచ్చిన మాటలను ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రాస్తారోకో చేస్తున్న అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. అనంతరం మంథని ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పోడు భూములపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదని, గిరిజనుల భవిష్యత్తు తో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు