ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం

23 Nov, 2022 02:06 IST|Sakshi

రాష్ట్రాల సాధికారతపై దాడి  

‘సహకార సమాఖ్యవాదం–ప్రస్తుత సవాళ్లు’ సదస్సులో వక్తలు

బన్సీలాల్‌పేట్‌: రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను, అధికారాలను హరిస్తోందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ మహబూబ్‌ కాలేజీలో మంగళవారం సహకార సమాఖ్యవాదం –ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని కాలరాసే విధంగా రాజకీయ నిర్ణయాలతో రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతోందన్నారు.

ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో అనేక సమస్యలను సృష్టిస్తూ గందరగోళం చేస్తోందని నిందించారు. ప్రముఖ విద్యావేత్త, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పీఎల్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌ కె. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, సీపీఐ కార్యదర్శి కె. సాంబశివరావు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత డాక్టర్‌ సుధాకర్‌  మాట్లాడారు. 

రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. 
ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాల సాధికారతపై దాడి చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. సెస్‌ల పేరిట రాష్ట్రాల ఆర్థికవనరులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాష్ట్ర జాబితాలోని అంశాలను కేంద్రం తీసుకొని పార్లమెంట్‌లో చట్టా లు చేయడమంటే రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేయడమేనన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ అక్రమాస్తులు పోగు చేసుకొనేవారిని వదిలేసి సమాజహితం కోసం పనిచేస్తున్న వరవరరావు, ప్రొఫెసర్‌ సాయిబాబాలను కేంద్రం జైల్లో పెట్టిందన్నారు. 

మరిన్ని వార్తలు