జీవవైవిధ్యంపై పట్టింపేది?

22 May, 2021 11:29 IST|Sakshi

నామమాత్రంగా కమిటీల నియామకం 

నిధుల ఖర్చుపై లెక్కల్లేవు

కనిపించని అవగాహన కార్యక్రమాలు

సిరికొండ: సూక్ష్మజీవుల నంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్ని పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతు జీవవైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం.

పర్యావరణ పరిరక్షణలో ఆహార గొలుసు చెడిపోకుండా 2002లో జీవవైవిధ్య చట్టం అమలులోకి వచ్చింది. దశాబ్దం తర్వాత 2014లో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు ఆరంభశూరత్వంలా మారింది. గ్రామ, మండల జీవవైవిధ్య కమిటీల ఏర్పాటు సాగుతూనే  ఉండటం, జిల్లాల్లో తగినంత సిబ్బందిని నియమించకపోవడం, కమిటీలు ఏర్పాటైన సభ్యులకు సరైన శిక్షణ లేకపోవడం, నిధుల ఖర్చుపై ఆడిట్‌ లేకపోవడం సమస్యలుగా మారాయి.  

పేరుకు కమిటీలు.. 
ఉమ్మడి జిల్లాలో జీవవైవిధ్య అమలు కోసం ఇద్దరు సమన్వయకర్తలు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఉమ్మ డి జిల్లాలో 51 మండలాలకు నాలుగు మండలాల్లో 1056 గ్రామ పంచాయతీలకు 219 గ్రామాలలో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు పథకం అమలు, జీవవైవిధ్య సంరక్షణపై తగిన శిక్షణ ఇవ్వాలి. వారసత్వ సంపదలైన వృక్షా లు, జంతువులు, పవిత్రవనాలు, జలాశయాలు, వారసత్వ కట్టడాలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిపై అవగాహన కలి్పంచాలి. కానీ గడిచిన ఏడెండ్లలో జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తగిన శిక్షణ లేక కమిటీల పనితీరు నామమాత్రంగా మారింది. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య కమిటీలకు రెండు దశల్లో నిధులు ఇవ్వాలని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిర్ణయించింది.

అందులో భాగంగా గ్రామ జీవవైవిధ్య కమిటీకి రూ.1.50 లక్షలు, మండల కమిటీకి రూ.1.50 లక్షలు, జిల్లా కమిటీకి రూ.2.30 లక్షలు ఇవ్వాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 24 గ్రామ పంచాయతీలకు రూ. 8.80 లక్షలు విడుదల అయ్యాయి. వీటిలో కార్యాలయ ఏర్పాటు అవసరమైన రికార్డులు ఫరీ్నచర్‌ కొనుగోలు క్షేత్ర స్థాయి పరిశోధనలకు కేటాయించాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటు లేకుండానే నిధులు స్వాహ అయ్యాయి. సరైన ఆడిట్‌ లేనందువల్ల గత సర్పంచుల హయాంలో నిధులకు లెక్కలేకుండా పోయాయి. మిగతా నిధులు విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు.

దెబ్బతింటున్న జీవవైవిధ్యం
ప్రకృతిలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హనికరమైన వైరస్‌లు విజృంభిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20 వేల జాతుల జీవులు వైరస్‌లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75 శాతం మేర జన్యుజీవవైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు