ట్రాన్స్‌జెండర్లతో సమావేశమైన సీపీ సజ్జనార్‌

20 Feb, 2021 03:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సజ్జనార్, పాల్గొన్న ఇతర అధికారులు

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాన్స్‌జెండర్‌ డెస్క్‌

తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా..

సాక్క్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోనే తొలిసారిగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో ట్రాన్స్‌జెండర్‌ డెస్క్‌ను శుక్రవారం కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరం నలుమూలల నుంచి 150 మంది ట్రాన్స్‌జెండర్లతో ఇంటర్‌ఫేస్‌లో కమిషనర్‌ సజ్జనార్‌ సమావేశమయ్యారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీతాకృష్ణన్‌ అభ్యర్థనపై ఈ డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతాకృష్ణన్‌ మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉపాధి, అద్దెకు ఇళ్ళు, సన్నిహిత భాగస్వామి హింస, వీధిలో వేధింపులు వంటివి ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ డెస్క్‌ ద్వారా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ట్రాన్స్‌జెండర్లు, వారి సంఘం ప్రజల్ని వేధించడం గానీ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గానీ పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ట్రాన్స్‌జెండర్ల ద్వారా ఎలాంటి సమస్యలున్నా ప్రజలు డయల్‌ 100కు, వాట్సప్‌ నంబర్‌ 9490617444 ద్వారా తెలుపవచ్చన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్, శంషాబాద్‌ డీసీపీ ఎన్‌. ప్రకాశ్‌రెడ్డి, డబ్ల్యూసీఎస్‌డబ్ల్యూ విభాగం డీసీపీ సి.అనసూయ, ఏడీసీపీ క్రైమ్‌ కవిత, పలువురు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు