కరోనా తర్వాతా రోగులకు కొన్ని దుష్ప్రభావాలు..అందుకోసం ప్రత్యేక ఓపీ!

31 May, 2021 03:52 IST|Sakshi

కరోనా తర్వాతా రోగులకు కొన్ని దుష్ప్రభావాలు

ఎక్కువ రోజులు చికిత్స తీసుకున్నవారిలోనూ సైడ్‌ ఎఫెక్ట్స్‌

అప్రమత్తమై చర్యలు చేపట్టిన వైద్య, ఆరోగ్య శాఖ

బోధన, ప్రధాన ఆస్పత్రుల్లో త్వరలో ప్రత్యేక ఓపీ సేవలు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 తీవ్రత నుంచి బయటపడి రకరకాల దుష్ప్రభావాలకు గురవుతున్న వారిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వారికి బోధన, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసి వైద్యమందించాలని నిర్ణయించింది. కోలుకున్నవారికి బ్లాక్, ఎల్లో ఫంగస్‌ల ప్రమాదం పొంచి ఉండగా, మరోవైపు ఇతర దుష్ప్రభావాలు కూడా వెలుగు చూస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. ముఖ్యంగా మధుమేహం, ఊపిరితిత్తులు, నరాలు, గుండె సంబంధిత సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత తదితర సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సైతం ఈ లక్షణాలను గుర్తించి రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండగా, కోలుకున్నవారిలో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంపై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

ప్రత్యేక ఔట్‌పేషంట్‌ విభాగాలు...
కోవిడ్‌ తర్వాత ఇతర ఇబ్బందులతో వచ్చేవారి కోసం బోధనాసుపత్రుల్లో దాదాపు ఆర్నెళ్ల వరకు ప్రత్యేక ఓపీ విభాగాలను వైద్య విద్యా శాఖ నిర్వహించనుంది. కోలుకున్న నెల తర్వాత ఈ దుష్ప్రభావాలు బయటపడుతున్నట్లు నిపుణులు గుర్తించిన నేపథ్యంలో ఎక్కువకాలం వీటిని నిర్వహిస్తే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని వైద్యశాఖ భావిస్తోంది. ఓపీ రోగులకు ఉచితంగా మాత్రల పంపిణీ చేయనున్నారు. దీర్ఘకాలిక సమస్యలతోపాటు పోస్టుకోవిడ్‌ దుష్ప్రభావాలకు గురైనవారికి పూర్తిచికిత్సను బోధనాసుపత్రుల్లోనే అందించనున్నారు. ముందస్తుగా ఈ దుష్ప్రభావాలను గుర్తిస్తే వేగంగా నయం చేసే అవకాశం ఉంటుందని, ఒకట్రెండు రోజుల్లో స్పెషల్‌ ఓపీ యూనిట్లను తెరుస్తామని వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వెల్లడించారు.

అలాంటివారంతా అప్రమత్తం
కొందరికి మాత్రమే పోస్ట్‌ కోవిడ్‌ దుష్ప్రభావాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నవారికి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇలాంటివారు తిరిగి సాధారణస్థితికి చేరుకునేందుకు మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది. స్టెరాయిడ్స్‌ తీసుకున్నవారికి మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులుండి కోవిడ్‌ చికిత్స తీసుకున్నవారు జాగ్రత్తగా ఉండకపోతే హార్మోన్ల అసమతుల్యత తలెత్తే ప్రమాదముంది. ఎక్కువ రోజులు ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్‌పై ఉండి కోలుకున్నవారిలో కూడా సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తన్నారు. అలాంటి వారికి రెగ్యులర్‌ చెకప్‌ చేయిస్తే ప్రమాదం తప్పుతుందని వైద్యులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు