సికింద్రాబాద్‌ విధ్వంసం: 2021లోనే వాట్సాప్‌ గ్రూప్‌.. ఇప్పుడు ఇలా ప్లాన్‌!

18 Jun, 2022 08:55 IST|Sakshi

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా శుక‍్రవారం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దీని వెనుక పెద్ద ప్లాన్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆందోళనకారులను విచారణలో భాగంగా వారి సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. 

హైదరాబాద్‌లోని హకీంపేట ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్‌ పరిధిలో 2021 మార్చి 31న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించారు. మొత్తం 6,900 మంది హాజరవగా.. ఫిజికల్, మెడికల్‌ పరీక్షలు దాటి 3 వేల మంది వరకు రాతపరీక్షకు ఎంపికయ్యారు. కరోనా కారణంగా ఆ ఏడాది మే 1న జరగాల్సిన రాతపరీక్ష వాయిదా పడింది. ఎప్పుడు పెడతారా అని అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో.. కేంద్రం అగ్నిపథ్‌ పేరిట ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ)’అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది.

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లు కాగా.. అగ్నిపథ్‌కు 21 ఏళ్లు మాత్రమే. ఓవైపు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ఆపేయడం, మరోవైపు వయోపరిమితి తగ్గి అర్హత కోల్పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ సమయంలో కలిసినప్పుడు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూపుల్లో దీనిపై ప్రచారం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే జంక్షన్‌ వద్ద నిరసన చేపడదామని నిర్ణయించుకున్నారు. 

వాట్సాప్‌ గ్రూపుల వేదికగా.. జస్టిస్ ఫర్ ఆర్మీ సీఈఈ, హకింపే ట్ ఆర్మీ సోల్జర్ పేరుతో ఉన్న గ్రూపుల్లో ఏం చేయాలో మాట్లాడుకున్నారు. వాట్సాప్‌లోనే విధ్వంసానికి ప్లాన్‌ చేసుకున్నారు. పెట్రోల్ బాటిల్స్, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలని ఆడియో సంభాషణలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు.. వాట్సాప్ గ్రూప్ ఆర్గనైజర్స్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

ఇక, సోషల్‌ మీడియా వేదికగా(ఇన్స్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌)లో మేసేజ్‌లు పంపుకున్నట్టు పోలీసులు తెలిపారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ నుండి వచ్చిన 300 మంది ఆందోళనకారులు స్టేషన్‌కు చేరుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునుకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కాగా, హైదరాబాద్ కమిషనర్ సైతం కుట్రకోణంపై దర్యాప్తునకు ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: ఆ భవనాన్ని ధ్వంసం చేసి ఉంటే, నెల రోజులు రైళ్లు బంద్‌!

మరిన్ని వార్తలు