చీవినింగ్‌తో లైఫ్‌ చిల్‌!

22 Oct, 2020 08:11 IST|Sakshi
భరత్‌ కుమార్‌, ప్రత్యూష

బ్రిటన్‌ ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశం

ఏడాది పాటు బ్రిటన్‌లోని వర్సిటీల్లో ఉచిత చదువు

ఒక్క స్కాలర్‌షిప్‌.. 150 యూనివర్సిటీలు.. 12 వేల కోర్సులు

చీవినింగ్‌కు ఎంపికైన పరకాల ప్రత్యూష, భరత్‌ల హర్షం

అక్కడి వర్సిటీల్లో చదువుపై తమ అభిప్రాయం పంచుకున్న ఇరువురు 

సాక్షి, హైదరాబాద్‌: నేర్చుకోవడం జీవితాంతం సాగే ప్రక్రియ. ఒకసారి ఉద్యోగం అనే బతుకు యుద్ధంలోకి ప్రవేశించాక చదివే తీరిక ఎక్కడుంటుంది. అవకాశాలూ అంతంత మాత్రమే! ఇదీ మనలో చాలామంది అనుకునేది. కానీ వాస్తవం వేరు అంటున్నారు పరకాల ప్రత్యూష, భరత్‌కుమార్‌లు. బ్రిటన్‌ ప్రభుత్వం ఇచ్చే చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌నకు తెలుగు రాష్ట్రాల నుంచి వీరు ఎంపికయ్యారు. ఉద్యోగాల్లో స్థిరపడినా కూడా నేర్చుకోవాలన్న ఆసక్తితో ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లండన్‌లో చదువు ఎలా ఉంటుంది? యూనివర్సిటీల తీరు తెన్నులేంటి? చీవినింగ్‌ స్కాలర్లుగా తమ ప్రాథమ్యాలేమిటి? భవిష్యత్‌ ప్రణాళికలేంటి.. తదితర విషయాలను వారు ఇలా పంచుకున్నారు.
పర్యావరణ కోసం: పరకాల ప్రత్యూష
‘చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌ మన జీవితాన్ని మార్చే అరుదైన అవకాశం. 2018లో అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న ఏకైక తెలుగు మహిళగా రికార్డు సృష్టించా. చీవినింగ్‌ స్కాలర్‌గా ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌పై బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్నా. సుస్థిరాభివృద్ధి, విధాన రూపకల్పన వంటి అంశాల్లో పనిచేస్తుంటాను. 2021లో కోర్సు పూర్తయిన కొంత సమయానికే బ్రిటన్‌లో జరగనున్న కాప్‌–26 కోసం పనిచేయాలని భావిస్తున్నాను. భారత్‌ తిరిగి వచ్చాక పర్యావరణ, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా’అని పరకాల ప్రత్యూష పేర్కొన్నారు.
వర్సిటీల గురించి..
‘బ్రిటన్‌లో విశ్వవిద్యాలయాల వ్యవస్థ చాలా వినూత్నమైంది. ఎంపిక చేసుకునేందుకు బోలెడన్ని కోర్సులు ఉన్నాయి. నా కోసం కూడా ఓ ప్రత్యేకమైన కోర్సు సిద్ధం చేసుకోవచ్చు. ఇక్కడి సిబ్బంది ఆయా రంగాల్లో నిష్ణాతులైనా కూడా చాలా కలుపుగోలుగా ఉంటారు. ఓపికతో, మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ఈ లక్షణాలన్నింటి వల్ల ఇక్కడి చదువు సంతృప్తినిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ అందరినీ గౌరవిస్తారు. ఎవరినీ చులకన చేసి మాట్లాడరు. విద్యార్థులందరి అభిప్రాయాలు, ఆలోచనలకు విలువ ఉంటుంది. దేశవిదేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలసి చదువుకోవడం వల్ల వారి సంస్కృతులు తెలుస్తాయి. చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌ అనేది జీవితకాలంలో దొరికే అద్భుత అవకాశం.  ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే మీరిచ్చే సమాధానాలు వీలైనంత నిజాయితీగా ఉండేలా జాగ్రత్త పడండి’ అంటూ చెప్పుకొచ్చారు.

ప్రత్యేక గుర్తింపు కోసం: భరత్‌కుమార్‌
‘ప్రజారోగ్య రంగంలో నాదైన గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. విశాఖపట్నంలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ చదివాను. సంజీవని వంటి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. గిరిజన సమాజాల అభివృద్ధికి నా వంతు సాయం చేశాను. విశాఖ జిల్లా గిరిజనులపై నేను జరిపిన అధ్యయం టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో చేరేలా చేసింది. అక్కడే ఎంఏ పూర్తి చేశా. వేర్వేరు స్థాయిల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పని చేయడం ప్రజారోగ్యం ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. అందుకే చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌లో భాగంగా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌లో ఉన్నత చదువు అభ్యసించేందుకు ఎంపిక కావడం సంతోషాన్నిస్తోంది. ప్రజా రోగ్య రంగంలో తాజా పరిశోధనలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వచ్చింది. జాతీయస్థాయిలో వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రజారోగ్యాన్ని మానవాభివృద్ధి సూచీలో భాగమయ్యేలా చేసేందుకు కృషి చేస్తా’అని భరత్‌ కుమార్‌ వివరించారు.

ఏమిటీ చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌?
బ్రిటన్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో అమలు చేస్తున్న స్కాలర్‌షిప్‌ పథకం ఇది. బ్రిటన్‌లోని సుమారు 150 యూనివర్సిటీల్లో సుమారు 12 వేల కోర్సుల్లో మీకు నచ్చిన దానిలో చేరేందుకు వీలు కల్పిస్తుంది. ఇప్పుడు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైతే బ్రిటన్‌లో ఏడాది కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఖర్చులను ఆ దేశ ప్రభుత్వమే భరిస్తుంది. చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారికి రెండేళ్ల వృత్తి అనుభవం ఉండాలి. దరఖాస్తుకు గడువు ఈ ఏడాది నవంబర్‌ 3వ తేదీ. 1983లో ప్రారంభమైన చీవినింగ్‌ స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌ల ద్వారా ఇప్పటివరకు సుమారు 3,200 మంది స్కాలర్లు బ్రిటన్‌లో విద్యను అభ్యసించారు.

మరిన్ని వార్తలు