మహమ్మారులపై మహాత్ముడి మంత్రోపదేశం 

2 Oct, 2020 04:05 IST|Sakshi

ప్రజారోగ్యంపై వందేళ్ల కిందే ప్రచారం 

స్వాతంత్య్ర పోరాటకాలంలోనూ ప్రజారోగ్యంపై చైతన్యం 

‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. అని నినదించిన గాంధీజీ 

‘‘శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనం సవాళ్లతో యుద్ధం చేయగలం. మంచి అలవాట్లతో దినచర్యను ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ప్రణాళికలు ఫలిస్తాయి. ప్రకృతి చెప్పిన మాట వింటే మానవాళికి మంచి జీవితం ఉంటుంది’’వందేళ్ల కిందట జాతిపిత గాంధీ మహాత్ముడు అన్న మాటలివీ. కోవిడ్‌ కోరల నుంచి బయటపడేందుకు ఇప్పుడు మానవాళి పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈ మాటలను సరిగ్గా ఆయన 150వ జయంతి వేళ మననం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

సాక్షి, హైదరాబాద్‌: అహింస.. రెండొందల ఏళ్ల ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడిన ఆయుధం. దేశ స్వాతంత్య్ర పోరాటకాలంలో మహాత్ముడు చెప్పిందదొక్కటేనా? ‘ఆరోగ్యమే మహాభాగ్యం’మనం ఇప్పుడు రోజులో ఒక్కసారైనా వినే, అనే మాట. ఇది కూడా మహాత్ముడి మంత్రోపదేశమే. కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మనం ప్రాణాలు దక్కించుకోవటంలో కొంతమేర పదిలంగా ఉన్నామంటే, మహాత్ముడి ఆ మాట కూడా కొంత కారణమనేవారూ లేకపోలేదు. మహమ్మారి అనగానే ఇప్పుడు మనకు కోవిడ్‌ స్ఫురణకు వస్తుంది. కానీ సరిగ్గా వందేళ్ల క్రితం ప్రపంచాన్ని ఇంతకు కొన్ని రెట్లు ఎక్కువగా అట్టుడికించిన స్పానిష్‌ ఫ్లూకు పర్యాయపదంగా దాన్ని వాడేవారు. వందేళ్ల క్రితం ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల ద్వారా మనదేశంలోకి వచ్చిన ఈ మహమ్మారి అప్పట్లో దాదాపు కోటిన్న ర మందిని బలితీసుకుంది. ఆంగ్లేయుల పాలనను అంతం చేసేందుకు స్వాతం త్య్ర ఉద్యమం క్రమంగా తీవ్రమవుతున్న తరుణంలో ఈ వ్యాధి ప్రబలింది.  

స్పానిష్‌ ఫ్లూతో నెలన్నర పోరాడిన మహాత్ముడు 
సరిగ్గా అంతకు నాలుగేళ్ల ముందే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహాత్మాగాంధీ, సబర్మతి ఆశ్రమంలో జాతీయోద్యమ రచనలో తలమునకలై ఉన్నారు. అదే సమయంలో గాంధీ, ఆయన అనుచరులకు కూడా స్పానిష్‌ ఫ్లూ సోకింది. దాదాపు నెలన్నరపాటు ఫ్లూను వదిలించుకునే పనిలో ఉండిపోయారు. చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటించే అలవాటున్న 48 ఏళ్లనాటి గాంధీ, సులభంగానే దాని నుంచి బయటపడ్డారు. కానీ, ప్రజల పరిస్థితే దారుణంగా ఉంది. ఫ్లూ దెబ్బకు యావత్తు దేశం బెంబేలెత్తింది. మళ్లీ వారిలో స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిల్చేందుకు దేశం నలుమూలలు పర్యటించిన మహాత్మాగాంధీ.. వెళ్లిన ప్రతిచోటా విధిగా చెప్పిన మాట.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ 

వైద్యుడి అవతారమెత్తిన గాంధీ 
అంటువ్యాధులు ప్రబలేందుకు అపరిశుభ్ర వాతావరణం, అలవాట్లే కారణాలు. అన్నింటా వెనకబడిన మనదేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు మరిన్ని వస్తాయని పసిగట్టిన గాంధీజీ జనంలో ఆరోగ్యంపై చైతన్యాన్ని రగిలించాలని గట్టిగా సంకల్పించుకున్నా రు. ఆయన పర్యటించిన ప్రతిచోటా స్వాతంత్య్ర ఉద్యమ నినాదాలు, ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు. అలా దేశవ్యాప్తంగా మారుమోగిన మాటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’. 

 ధ్యానం.. వ్యాయామం..  
రోజూ ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచే అలవాటున్న మహాత్ముడికి ప్రాతఃవేళ ప్రకృతిని పరిశీలించటమంటే ఎంతో ఇష్టం. ధ్యానం, వ్యాయామం ఆయన నిత్యకృత్యం. ఆ తర్వాత హాయిగా నడక సాగిస్తారు. చివరకు తన ఉద్యమ కార్యాచరణతోనూ దాన్ని అనుసంధానించేవారు. ఎక్కడికి వెళ్లినా వేగంగా నడుస్తూ ముందుకు సాగటాన్ని ఆయన అలవాటు చేసుకున్నారు. ఇక సాయంత్రం వేళ దాదాపు గంట సేపు ప్రత్యేకంగా వ్యాయామ నడకకు ప్రాధాన్యం ఇచ్చేవారు. పడుకునే వేళ మళ్లీ కాసేపు నడకకు సమయం కేటాయించేవారు. వెరసి ఒక రోజులో 8 మైళ్లకు తగ్గకుండా నడిచేవారట. భోజనంలోనూ ఆయన ప్రత్యేకతను చూపించారు. పచ్చి కూరలు, తాజా పళ్లను ఎక్కువగా ఇష్టపడేవారు. వాటిల్లో ఉండే పోషకాలను ఒడిసి పట్టుకోవటం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండాలన్నది ఆయన మాట. దేశంలో ఎక్కువ మంది పేదలే అయినందున వారు చవకగా ఆరోగ్యాన్ని పొందటం వీటితోనే సాధ్యమని పదేపదే చెప్పేవారు. 

చలికాలమైనా కిటికీ కొంత తెరిచి ఉండాల్సిందే.. 
 ఎంతటి చలి ఉన్నా ఇంటి కిటికీ అద్దాలను కనీసం 4 అంగుళాల మేర అయినా తెరిచిపెట్టుకోవటం గాంధీకి అలవాటు. ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన గాలిని ఆహ్వానించటం ఆరోగ్యానికి మంచిదని ఆయన బలంగా నమ్మేవారు. జ్వరం ఉంటే కనీసం రెండు సార్లు స్నానం చేయాలని ఆయన చెబుతారు. ఒకవేళ స్నానం చేసే ఓపిక లేని పక్షంలో కనీసం పొత్తికడుపుపై మట్టి పట్టీ వేసుకోవాలని చెప్పేవారు. నిత్యం రెండు నిమ్మకాయల రసాన్ని వినియోగించటం బాపూకు ఉన్న అలవాటు. పచ్చి కూరలు, పండ్లు ఆ పక్కనే నూనె, పంచదార, మాంసం.. ఇవి అనారోగ్యకర ఆహార కలయిక అనేవారు. రాత్రి తొందరగా నిద్రకు ఉపక్రమించటం, ఉదయం తొందరగా లేవటం లాంటి అలవాట్లు జీవితాన్ని సక్రమ మార్గంలో ఉంచుకోవటం, ఏకాదశి, ఇతర కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం చేయటం ద్వారా శరీర అవయవాల గతిని నియంత్రణలో ఉంచుకోవటం.. ఇలాంటి ఆరోగ్య సూత్రాలు బాపూ వద్ద ఎన్నో...  

>
మరిన్ని వార్తలు