బాలలు భళా.. తమదైన మార్క్‌తో సత్తా చాటారు..

14 Nov, 2022 08:16 IST|Sakshi

సృజనాత్మకతను చాటుతున్న నగర చిన్నారులు  

నచ్చిన రంగాల్లో అద్భుత ప్రతిభా పాటవాలు  

సంగీతం, క్రీడలు, నటనలో తమదైన ముద్ర  

నేడు బాలల దినోత్సవం

ర్యాంకుల కోసం పరుగెత్తడం. ఒకరితో ఒకరు పోటీ పడటమే చదువుల లక్ష్యంగా మారిన ప్రస్తుత తరుణంలో ఎంతోమంది చిన్నారులు చదువుతో పాటు నచ్చిన రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. వైవిధ్యంగా, విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమాలు, సంగీతం, ఆటలు.. ఇలా ఏ రంగమైనా సరే సృజనాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తున్నారు. వీరి సృజనకు తల్లిదండ్రులు పట్టం కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో వైవిధ్యాన్ని, సృజనాత్మకతను చాటుతున్న  నగరంలోని కొందరు చిన్నారులపై కథనం..

నటన అద్భుతం.. ‘అక్షర’ సంగీతం..  
ఆటమిక్‌ ఎనర్జీ సైంటిస్ట్‌ చంద్రశేఖర్, ఆశాలత దంపతుల రెండో కూతురు అక్షర. రాజన్న, బాహుబలి వంటి చిత్రాల్లో తన అద్భుత గాత్రంతో అలరించిన అమృతవర్షిణి చెల్లెలు. ఇప్పుడు బేగంపేట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది అక్షర. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ మేటి బాల నటిగా ప్రశంసలనందుకొంటోంది. సర్దార్‌ గబ్బర్‌సింగ్, స్పైడర్, బ్రహ్మోత్సవం, సర్కారువారి పాట, భాగమతి వంటి 25కు పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘అహ నా పెళ్లంట’ అనే ఓ మ్యూజికల్‌ ఆల్బమ్‌ను కూడా సొంతంగా రూపొందించింది. ఎన్‌సీసీలోనూ సత్తా చాటుకుంటోంది. ‘సినిమాలో నటించడం అభిరుచి మాత్రమే. డాక్టర్‌ కావాలనేదే నా ఆశయం’ అంటోంది అక్షర.  

నగరానికి చెందిన కపిల్, చాణక్య, విశ్వతేజ అనే బాలురు ‘అచీవర్‌’ అనే ఓ బాలల చిత్రంలో నటించారు. ఇటీవల  కాలంలో విడుదలవుతున్న సినిమాల్లో పిల్లలకు నచ్చే ఎలాంటి ఇతివృత్తాలు లేకపోవడంతో దర్శకుడు తల్లాడ సాయికృష్ణ ఈ సినిమాను రూపొందించారు. చదువుకొనే వయసులోనే  సామాజిక సేవను కూడా ఒక అభిరుచిగా, బాధ్యతగా  భావించే ముగ్గురు పిల్లలు ప్రశాంతమైన హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాద ముఠా బాంబు పేలుడుకు చేసిన కుట్రను అడ్డుకుంటారు. ఉగ్రవాదులు స్కూల్లో, ఆలయంలో, మార్కెట్‌లో పేల్చేందుకు సిద్ధం చేసిన బాంబులను తమకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరీ్వర్యం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. బాలల చిత్రాల పోటీల కోసం పంపించనున్నట్లు సాయికృష్ణ  తెలిపారు.     

ఫుట్‌బాల్‌తో ‘స్నేహం’
షేక్‌పేట్‌లోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్లో పదో తరగతి చదువుతున్న పొన్నాపల్లి స్నేహ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా రాణిస్తోంది. ఐసీఎస్‌ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన ఈ చిన్నారి జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సంగీతంలోనూ  ప్రావీణ్యం సంపాదించింది. ‘నాన్న సారథి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ‘ఫుట్‌బాల్‌ పట్ల ఉన్న ఇష్టాన్ని గమనించిన అమ్మా, నాన్న నన్ను ప్రోత్సహించారు. అక్క శ్వేత బాగా పాడుతోంది. నేను మాత్రం ఫుట్‌బాల్‌ ఆటలోనే మరిన్ని విజయాలను సాధించాలని  నిర్ణయించుకున్నాను’ అని వివరించింది స్నేహ.   

మరిన్ని వార్తలు