ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక వ్యూహం

26 Mar, 2021 10:26 IST|Sakshi

ఇప్పటి వరకు   రూ.256.68 కోట్లు వసూలు 

బకాయిలు రూ.253.08 కోట్లు

బకాయిదారులకు  రెడ్‌  నోటీసులు  

సాక్షి,గచ్చిబౌలి: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లలో శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ సింహ భాగంలో నిలుస్తోంది. వెస్ట్‌జోన్‌లో ముఖ్యంగా  శేరిలింగంపల్లి, చందానగర్‌ సర్కిళ్ల నుంచి అధిక ఆదాయం వస్తోంది. జోన్‌ పరిధిలో రూ.509.76 కోట్ల ఆస్తి పన్ను వసూలు టార్గెట్‌  కాగా, ఇప్పటికే రూ.256.68 కోట్లు వసూలు చేశారు. రూ.253.08 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో  రోజు వారీ టార్గెట్లు నిర్ధేశిస్తూ ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచారు. మొండి బకాయిదారులు, కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక వ్యూహంతో వసూళ్లు చేయాలని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు దిశానిర్ధేశం చేస్తున్నారు. మొండా బకాయిదారులకు ఇప్పటికే రెడ్‌ నోటీసులు జారీ చేశారు.  

2,22,174 అసెస్‌మెంట్లు 
శేరిలింగంపల్లి వెస్ట్‌ జోన్‌ పరిధిలోని నాలుగు సర్కిళ్ల పరిధిలో 2,22,174 అసెస్‌మెంట్లు ఉన్నాయి. యూసూఫ్‌గూడ సర్కిల్‌లో 32,131 అసెస్‌మెంట్లు, శేరిలింగంపల్లిలో 84,712 అసెస్‌మెంట్లు, చందానగర్‌లో 83,875 అసెస్‌మెంట్లు, పటాన్‌చెరు సర్కిల్‌ పరిధిలో ఉన్న 21,456 అసెస్‌మెంట్ల ద్వారా మొత్తం రూ.509.76 కోట్లు వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు.  

రెడ్‌ నోటీసులు జారీ 
జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో దాదాపు రూ.200 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి. మొండి బకాయిదారులకు రెడ్‌ నోటీసులు జారీ చేశారు. 16688 అసెస్‌మెంట్లకు రెడ్‌ నోటీసులు జారీ చేయాల్సి ఉంది. యూసూఫ్‌గూడ 5380, శేరిలింగంపల్లి 1800, చందానగర్‌ 8251, పటాన్‌చెరు 1257 అసెస్‌మెంట్లకు రెడ్‌ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు దాదాపు పదివేల మందికి రెడ్‌ నోటీసులు జారీ చేశారు. బకాయిల వసూళ్లపై సిబ్బందికి అధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు.  ట్యాక్స్‌ కలెక్షన్‌కు వెళ్లినప్పుడు వడ్డీ రాయితీపై అవగాహన కలి్పస్తారు. 

ఇలా వసూలు ... 
► మొదట డిమాండ్‌ నోటీసు అందజేత 
► స్పందించకుంటే రెడ్‌ నోటీస్‌తో పాటు వారెంట్‌ను ఉప కమిషనర్లు జారీ చేస్తారు. 
► వాణిజ్య సముదాయాలకు అక్యుపై నోటీస్‌ జారీ చేస్తారు. అయిన స్పందించకుంటే భవనం జప్తు చేస్తారు. 
► గత ఫిబ్రవరి నుంచి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఎంటమాలజీ విభాగాల సిబ్బంది, అధికారులు ఆస్తి పన్ను వసూళ్లలో పాల్గొంటున్నారు.  
► ఆయా డాకెట్లలో మొదట బిల్‌ కలెక్టర్, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఆస్తి పన్ను వసూలకు వెళ్తారు. 
► అయిన స్పందించకుంటే డాకెట్‌లోని 9 మంది సభ్యుల బృందం వెళ్లి సంప్రదిస్తుంది. 
► పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను రావాల్సిన చోటుకు ఉప కమిషనర్లు కూడా వెళ్తారు. 
► మార్చి 31 లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కలి్పస్తారు. 
► కోవిడ్‌ కారణంగా వర్కింగ్‌ హా స్టళ్లు మూసివేయడంతో ఆస్తి వసూలులో జాప్యం జరుగుతోంది. 
► వెస్ట్‌జోన్‌ పరిధిలోని గచి్చ»ౌలి, కొండాపూర్, మాదాపూర్, గౌలిదొడ్డి, ఏపీ హౌసింగ్‌ బోర్డు కాలనీల్లో వందలాది వర్కింగ్‌ హాస్టళ్లు ఉన్నాయి. 

వంద శాతం వసూలు చేస్తాం 
ఆస్తి పన్ను వసూలు వంద శాతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్‌ కారణంగా కొన్ని వ్యాపార సంస్థలు, హాస్టళ్లు మూతపడటంతో పన్ను వసూళ్లు కొంత మేరకు తగ్గాయి. వెస్ట్‌ జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో ఆస్తి వసూలుపై రోజు వారీ టార్గెట్లు ఇస్తున్నాం. మొండి బకాయిల వసూలుపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. బకాయిల వసూలుపై ఎలాంటి వ్యూహంతో ముందుకెవెళ్లాలో అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లించి వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి: ఎన్‌.రవి కిరణ్, వెస్ట్‌జోన్‌ జోనల్‌ కమిషనర్‌   

మరిన్ని వార్తలు