మూడేళ్ల కిందట మాటలు బంద్‌.. మూగవాడికి మాటలొచ్చాయ్‌!

18 Apr, 2022 10:03 IST|Sakshi
దేవాలయం వద్ద బ్రహ్మచారి

గుడి మహత్మ్యం అంటున్న భక్తులు 

కేశంపేట: ఓ ప్రమాదంలో మాట కోల్పోయిన వ్యక్తికి తిరిగి మాటలు వచ్చాయన్న ఉదంతం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం చర్చనీయాంశమైంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడ్డాడు. బ్రెయిన్‌కు గాయాలవ్వడంతో అతడు మాట కోల్పోయాడు. వైద్యులను సంప్రదించగా రూ.3లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు.
(చదవండి: స్టంట్లు చేస్తున్నారా.. జర జాగ్రత్త.. పోలీసులు ఇంటికే వచ్చేస్తారు!)

అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులు అలాగే వదిలేశారు. ఈ క్రమంలో గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో కలిసి బ్రహ్మచారి సైతం వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష చేపట్టాడు. దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఆదివారం ఉదయం ఆలయ గర్భగుడిని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడడం మొదలుపెట్టాడు.

మొదటగా గర్భగుడిలో ఉంటేనే మాటలు రావడం.. బయటికి వస్తే రాకపోవడం గమనించారు. దీంతో స్వామివారికి 11బిందెలతో అభిషేకం చేయడంతో మాటలు పూర్తిగా రావడం మొదలైంది. గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో ఈ అద్భుతం జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గతంలో మాటలు రాలేదని.. తిరిగి రావడం వాస్తవమేనని పలువురు స్థానికులు ధ్రువీకరిస్తున్నారు. కాగా, దీనిపై డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ దామోదర్‌ వివరణ కోరగా బ్రెయిన్‌కు గాయం అయినప్పుడు ఇలా మాటలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. గాయం మానినప్పుడు అనుకోని పరిణామాల్లో తిరిగి రావచ్చని అభిప్రాయపడ్డారు.  
(చదవండి: వాలీబాల్‌ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి)

మరిన్ని వార్తలు