మాటను బట్టి మనిషిని చిత్రిస్తుంది

7 May, 2022 04:29 IST|Sakshi

ఫొటో అప్‌లోడ్‌ చేస్తే డేటాబేస్‌లో పరిశీలించి ఎవరో గుర్తించడం ఇదివరకు చూశాం కానీ.. మాట్లాడితే ఆ ధ్వనిని బట్టి మాట్లాడిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుందో గీసేయడం చూశారా? అది కూడా డేటాబేస్‌లో ఆ ధ్వని ఎవరిదో పరిశీలించకుండా! ‘మాట్లాడితే ఆడో, మగోచెప్పొచ్చు కానీ.. ఏ మనిషని ఎలా గుర్తిస్తాం?’ అనుకోవచ్చు. కానీ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు మాత్రం ‘మాటలు చాలు’.. మనిషెవరో పసిగట్టేస్తామంటున్నారు. ఇలాంటి పని చేయగల ‘స్పీచ్‌2ఫేస్‌’ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అడ్వాన్స్‌డ్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ను వీళ్లు అభివృద్ధి చేస్తున్నారు.

ఈ ఏఐ.. మనుషుల మాటలను బట్టి వాళ్ల ముక్కు, చెంప ఎముకలు, దవడ ఆకారాన్ని గీసేస్తుంది. మనుషులు మాట్లాడే విధానం వాళ్ల ముక్కు, ఇతర ముఖం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుందనే సూత్రంపై ఆధారపడి ఇది పని చేస్తుంది. అయితే ఈ ఏఐ ఇంకా ప్రాధమిక దశలో ఉంది. కొన్నిసార్లు ముఖాలను తప్పుగా కూడా గీస్తోంది. ఉదాహరణకు హై పిచ్‌ గొంతున్న మగ వారిని ఈ ఏఐ ఆడవారిగా గుర్తిస్తోంది. ఆడవాళ్లకు డీప్‌ వాయిస్‌ ఉంటే మగవారని చెబుతోంది. ఆసియా ప్రజలు ఇంగ్లిష్‌ బాగా మాట్లాడితే కాస్త పశ్చిమ దేశాల ప్రజల ముఖాలను పోలినట్టు చూపిస్తోంది. ఈ ఏఐలో కొన్ని లోపాలు కనిపిస్తున్నా.. ఇది అద్భుతాలు చేస్తోందని, మున్ముందు పరిశోధనలకు ఇది ఊతమిస్తోందని పరిశోధకులు అంటున్నారు. 
– సాక్షి,సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు