తెలంగాణలో ‘స్పినోడాన్‌’ శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

2 Oct, 2022 03:15 IST|Sakshi

ఆరున్నర కోట్ల ఏళ్ల కింద గ్రహశకలం ఢీకొన్నప్పుడు డైనోసార్లతో సహా అంతమైన జాతి

న్యూజిలాండ్, అర్జెంటీనాల్లో మాత్రమే బతికినట్టు గతంలో ప్రకటించిన శాస్త్రవేత్తలు

వికారాబాద్‌ సమీపంలోని నష్కల్‌లోనూ అది జీవించినట్టు తాజాగా గుర్తింపు

ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ ‘వెర్టిబ్రేట్‌ పేలియాంటాలజీ’లో పరిశోధన వివరాలు

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం.. ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొని ప్రళయం సంభవించింది. అప్పట్లో భూమిపై జీవిస్తున్న సరీసృపాల (పాకే జంతువులు)లో 83 శాతం వరకు అంతరించిపోయాయి. రాక్షస బల్లులూ అంతమయ్యాయి. కానీ తొండలా ఉండే ఓ జీవి మాత్రం ఆ పరిస్థితిని తట్టుకుని.. న్యూజిలాండ్, అర్జెంటీనా ప్రాంతాల్లో బతకగలిగింది. క్రమంగా అర్జెంటీనాలోనూ కనుమరుగైన ఆ జీవులు న్యూజిలాండ్‌లోని పలు ద్వీపాల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఆ జీవుల పేరు స్పినోడాన్‌.. న్యూజిలాండ్‌లో వాటిని టువాటరా అని పిలుస్తారు. అయితే ఇప్పుడు అమెరికా కేంద్రంగా వెలువడే సైన్స్‌ జర్నల్‌ ‘వెర్టిబ్రేట్‌ పేలియంటాలజీ’ కొత్త విషయాన్ని ప్రపంచం ముందుంచింది. నాటి ప్రళయం నుంచి తెలంగాణలోని నష్కల్‌ ప్రాంతంలోనూ స్పినోడాన్‌ బతికి నిలిచింది. సెప్టెంబర్‌ 26న తమ ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. వచ్చే నెలలో ఈ జర్నల్‌ ప్రింట్‌ ఎడిషన్‌ విడుదల కానుంది.

వెన్నుపై ముళ్లలాంటి నిర్మాణాలతో..
చూడటానికి తొండలా కనిపించే స్పినోడాన్‌లు రింకోసె­ఫాలియా ప్రజాతికి చెందినవి. వీటికి మొసలి­లాంటి తోక, మందమైన చర్మం, శరీరంపై పొలు­సులు, తల నుంచి తోక చివరిదాకా పైభాగంలో ముళ్లలాంటి భాగాలు ఉంటాయి. కోట్ల ఏళ్లుగా పెద్ద­గా రూపాంతరం చెందకుండా ఉండటంతో వీటిని బతికున్న శిలాజాలు (లివింగ్‌ ఫాజిల్స్‌)గా అభి­వర్ణిస్తుం­టారు. భూమిని భారీ గ్రహశకలం ఢీకొన్న తర్వాత న్యూజిలాండ్, అర్జెంటీనాలలో తప్ప మరె­క్క­డా ఈ ప్రజాతి జీవులు బతికిలేవని ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ తెలంగాణలో వికారాబాద్‌కు సమీపంలోని నష్కల్‌లోనూ బతికాయని ఇటీవల గుర్తించారు. 

మరోసారి వార్తల్లోకి..
నష్కల్‌లో మూడు దశాబ్దాల క్రితం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి. నాటి శాస్త్రవేత్తలు అనంతరామన్, చకిలం వేణుగోపాల్‌లతో కూడిన బృందం తవ్వకాలు జరిపి.. సరీసృపాలు, క్షీరదాలకు చెందిన ఎన్నో శిలాజాలను గుర్తించింది. అందులో సూక్ష్మ క్షీరదాల శిలాజాలు ఉన్నట్టు నిర్ధారించడంతో ప్రపంచ పరిశోధకుల దృష్టి నష్కల్‌పై పడింది. ఇప్పుడు మరో విశిష్టతనూ సొంతం చేసుకుంది.

శిలాజాల్లోని ఓ జీవికి చెందిన దవడ, ఇతర భాగాలపై.. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్‌ జి.డీమర్‌ జూనియర్, గ్రెగరీ పి.విల్సన్‌ మాంటిల్లా, జెఫ్రీ ఎ.విల్సన్‌ మాంటిల్లాలతోపాటు మన దేశ శాస్త్రవేత్తలు ఎస్‌.అనంతరామన్, ఆర్‌.శివకుమార్, దిలీప్‌ చంద్ర దస్సారామ్‌లతో కూడిన బృందం పరిశోధనలు చేసింది. అది స్పినోడాన్‌ శిలాజమని, గ్రహశకలం ఢీకొన్న చాలా కాలం తర్వాతది అని తేల్చింది. అంటే గ్రహశకలం ఢీకొన్న తర్వాత కూడా ఈ ప్రాంతంలో స్పినోడాన్‌ జీవులు తిరుగాడినట్టు నిర్ధారించింది. శాస్త్రవేత్తలు దీనికి యాక్రా స్పినడాంటియాగా నామకరణం చేశారు.

నష్కల్‌ ప్రాంతాన్ని కాపాడాలి
నష్కల్‌ చాలా విలువైన ఆధారాన్ని అందించింది. ఇప్పుడు ప్రపంచ పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ పరిశోధనలు కొనసాగిస్తే మరెన్నో అద్భుత విషయాలను గుర్తించవచ్చు. ఇంత ముఖ్యమైన ప్రాంతాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి.
– చకిలం వేణుగోపాల్, ఆధారాలు సేకరించిన శాస్త్రవేత్తల బృందం సభ్యుడు 

మరిన్ని వార్తలు