రెండుగా చీలిన ఆర్టీసీ కార్మిక సంఘం

28 Sep, 2020 10:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్‌ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భవిష్యత్‌ కార్యాచరణ గురించి ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్‌రెడ్డి సహా ఆయన మద్దతుదారులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. (చదవండి: అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది)

ఇక ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఈ భేటీలో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ రెండు చీలిపోయింది. 

మరిన్ని వార్తలు