Sri Rama Navami 2022: నేత్రపర్వం.. సీతారామ కల్యాణం

11 Apr, 2022 03:44 IST|Sakshi
పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు 

భక్తులతో పోటెత్తిన భద్రగిరి

రెండేళ్ల తర్వాత ‘మిథిలా’లో వేడుక 

పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి 

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తితో గత రెండేళ్లుగా ఆంతరంగికంగానే సాగిన ఈ వేడుక తిరిగి ఎప్పటిలాగానే మిథిలా స్టేడియంలో భక్తుల జయజయ ధ్వానాల నడుమ కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో కల్యాణ మండపం మార్మోగింది.

స్వామి వారి కల్యాణం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే రామాలయం తలుపులు తెరిచారు. రామయ్యకు సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళా శాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూలవరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షణ నిర్వహించి కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు.

సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నం రాగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళసూత్రాలకు మాంగల్య పూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగల్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. 

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో భద్రాద్రి రాముని కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం తరఫున ఆలయ వైదిక కమిటీ సభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేడుకలో మంత్రు లు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్‌  పాల్గొన్నారు.  

ఇక భద్రగిరి, బాసర అభివృద్ధి:మంత్రి 
రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యాన భద్రాచలంతోపాటు బాసర క్షేత్రం అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రామయ్య కల్యాణోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు.

నేడు భద్రాచలానికి గవర్నర్‌
శ్రీరామ నవమి తర్వాత రామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుక నిర్వహించడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

మరిన్ని వార్తలు