కల్లుకు పూర్వ వైభవం తీసుకువస్తాం

17 Aug, 2021 03:15 IST|Sakshi
సర్దార్‌సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని  ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో శ్రీనివాస్‌గౌడ్‌ 

పాపన్న నూతన విగ్రహ ఆవిష్కరణ 

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: దేవతలు సురాపాకంగా భావించి సేవించిన కల్లు అమృతంలాంటిదని ఎక్సైజ్‌ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కల్లుకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు. సోమవారం చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బహుజన విప్లవ వీరుడు సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న నూతన విగ్రహాన్ని శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.

ఒక గౌడ కులానికే కాకుండా బడుగు, బలహీన వర్గాల విముక్తి కోసం ఆయన ఎంతగానో కృషిచేశారన్నారు. కొంతమంది కల్లు మంచిది కాదని దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కల్లుకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో నీరా స్టాల్స్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ బాలగోని బాలరాజు గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కన్వీనర్‌ వెంకన్నగౌడ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌కుమార్‌ గౌడ్, వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ గౌడ్, రమణ, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, మాజీ ఎంపీలు నర్సయ్యగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి సత్యనారాయణ, అజన్‌కుమార్‌ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, రాజేంద్రప్రసాద్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు