శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించిన మంత్రులు 

4 Nov, 2021 04:06 IST|Sakshi
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఓదారుస్తున్న మంత్రి కేటీఆర్‌ 

కేటీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న శ్రీనివాస్‌గౌడ్‌ 

పాలమూరు: తల్లి మృతితో దుఃఖంలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. గత నెల 29న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తల్లి శాంతమ్మ గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. మహబూబ్‌నగర్‌ పట్టణం శ్రీనివాసకాలనీలోని మంత్రి నివాసానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. కేటీఆర్‌ని చూసిన శ్రీనివాస్‌గౌడ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.

కేటీఆర్‌ ఆయనకు ధైర్యం చెప్పారు. కేటీఆర్‌తో పాటు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి శాంతమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. తరువాత వ్యవసాయ క్షేత్రంలోని శాంతమ్మ సమాధిని మంత్రి హరీశ్‌రావుతో కలిసి సందర్శించారు. అనంతరం హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమయ్యారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు మంత్రిని పరామర్శించిన వారిలో ఉన్నారు.


శాంతమ్మ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు 

బాలిక కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్‌ 
ఆరేళ్ల బాలిక మీద అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌ గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ బాలిక నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం బాలిక కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

>
మరిన్ని వార్తలు