వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఎస్సారెస్పీ!

4 Apr, 2021 08:23 IST|Sakshi

ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ప్రాంతం కమ్యూనిటీ రిజర్వుగా గుర్తింపు

పీసీసీఎఫ్‌ శోభ క్షేత్రస్థాయి పరిశీలన  

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అటవీశాఖ 

సాక్షి,నిజామాబాద్‌: కనువిందు చేసే కృష్ణజింకలు, ఫ్లెమింగో, ఫెలికాన్‌ వంటి విదేశీ పక్షుల కిలకిలలతో శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతం ఇకపై వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారనుంది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని ‘కమ్యూనిటీ రిజర్వు’గా ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (పీసీసీఎఫ్‌) కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదిత ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాన్ని పీసీసీఎఫ్‌ శోభ శుక్రవారం పరిశీలించారు. 

కృష్ణజింకల గంతులు 
నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల సరిహద్దుల్లో శ్రీరాంసాగర్‌ జలాశయం బ్యాక్‌వాటర్‌ ప్రాంతం సుమారు నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గినప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చిక బయళ్లుగా మారుతుంది. కనుచూపు మేర పచ్చదనం పరుచుకుంటోంది. ఆహారం కోసం గుంపులు గుంపులుగా సంచరించే కృష్ణజింకలు కనువిందు చేస్తుంటాయి. ప్రతిరోజు సూర్యోదయం అవుతుంటే చాలు సమీపంలోని గుట్టల చాటు నుంచి బయటకు వస్తున్నాయి. రాజస్తాన్, కర్నూల్‌ జిల్లాలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో మాత్రమే కనిపించే ఈ జింకలు ఇక్కడ సుమారు 30 వేల వరకు ఉంటాయని అటవీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 


ప్రజల భాగస్వామ్యంతో.. 
నూతనంగా ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ రిజర్వును ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. నందిపేట్‌ మండలం జీజీ నడుకుడ గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తారు. సంరక్షణ కేంద్రం నిర్వహణ బాధ్యతలను కమిటీకి అప్పగిస్తారు. అలాగే.. పర్యాటకుల సౌకర్యం కోసం వ్యూ పాయింట్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ రిజర్వు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి సునీల్‌ హీరేమత్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు