శ్రీశైలం ‘హైడల్‌’ పునరుద్ధరణ !

14 Feb, 2023 02:55 IST|Sakshi

ఎట్టకేలకు 4వ యూనిట్‌కూ మరమ్మతులు పూర్తి

కేరళ నుంచి వచ్చిన జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ 

అందుబాటులోకి 900 మెగావాట్ల సామర్థ్యం 

ఇంకా సర్జ్‌ పూల్‌లోనే మునిగి ఉన్న గేటు 

బయటకు తీసేందుకు జంకుతున్న సిబ్బంది 

దీంతో ఇప్పట్లో 4వ యూనిట్‌లో ఉత్పత్తి లేనట్టే 

రెండున్నరేళ్లు గడిచినా కొలిక్కి రాని విచారణలు 

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్ల కిందట ప్రమాదంలో కాలిపోయిన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రం పునరుద్ధరణ ఎట్టకేలకు సంపూర్ణమైంది. 4వ యూనిట్‌కు సైతం తాజాగా మరమ్మతులు పూర్తయ్యాయి. అయితే ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో పడిపోయిన భారీ గేటు.. ఇంకా బయటకు తీయకపోవడంతో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు అడ్డంకిగా మారింది. గేటును బయటకు తీసిన తర్వాతే 4వ యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు వీలుంది. మరమ్మతులకు రూ.60 కోట్లకు పైగా వ్యయమైందని జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి. 

ఎట్టకేలకు కేరళ నుంచి వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్‌ ! 
900(6 ్ఠ150) మెగావాట్ల శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అన్ని యూ నిట్లు కాలిపోయాయి. అందులో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఇతర సిబ్బందితో సహా మొత్తం 9 మంది ఈ ప్రమాదానికి బలయ్యారు. 1, 2 వ యూనిట్లకు అదే ఏడాది మరమ్మతులు జరిపి వినియోగంలో తీసుకురాగా..3, 5, 6వ యూనిట్లను తర్వాతి కా లంలో వినియోగంలోకి తెచ్చారు.

నాలుగో యూని ట్‌కి సంబంధించిన జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తి గా కాలిపోగా, అప్పటికప్పుడు అలాంటి ట్రాన్స్‌ఫార్మర్‌ మార్కెట్‌లో ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం నిర్మాణం సమయంలో ..ట్రాన్స్‌ఫార్మర్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్స్‌ కేరళ లిమిటెడ్‌ (టెల్క్‌) తయారు చేసిన 190 ఎంవీఏ సామర్థ్యం కలిగిన 3 లింబ్‌ జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగించారు.

నాటి ట్రాన్స్‌ఫార్మర్ల డిజైన్, నమూనాలను పంపించి అలాంటిదే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ కోసం టెల్క్‌కి జెన్‌కో ఆర్డర్‌ పెట్టింది. భారీగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉండడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీకి టెల్క్‌ రెండేళ్లకు పైగా సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఇటీవల కేరళ నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ రావడంతో 4వ యూనిట్‌కు మరమ్మతులు సైతం పూర్తయినట్టు జెన్‌కో వర్గాలు తెలిపాయి. 

కొలిక్కి రాని విచారణలు 
శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా సీఐడీ విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. దక్షిణ డిస్కం సీఎండీ నేతృత్వంలోని టెక్నికల్‌ కమిటీ సైతం విచారణ నివేదికను సమర్పించలేదని సమాచారం. ఓ వైపు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ.. మరో వైపు విద్యుదుత్పత్తిని నియంత్రించే ఆటోమేటిక్‌ కంట్రోల్‌ సిస్టంలోని ప్యానెల్‌ బోర్డులో బ్యాటరీలను మార్చే పనులను సమాంతరంగా చేపట్టడంతోనే షార్ట్‌ సర్యు్కట్‌ సంభవించి ఈ ఘోర ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.

ప్రమాదం జరిగిన వెంటనే విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసి ఉంటే ప్యానెల్‌బోర్డు వద్దే మంటలను నియంత్రించే అవకాశం ఉండేదని నిపుణులు అంటున్నారు. అవగాహన లేక ఇంజనీర్లు, సిబ్బంది అగ్నిమాపక పరికరంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉత్పత్తి నిలుపుదల చేసినా, గ్రిడ్‌ నుంచి సమీపంలోని సబ్‌స్టేషన్‌ ద్వారా శ్రీశైలం విద్యుత్‌ కేంద్రానికి రివర్స్‌ విద్యుత్‌ సరఫరా జరిగింది.

మంటలు ప్యానెల్‌ బోర్డు నుంచి సమీపంలోని జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు వ్యాపించాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ కాలిపోవడంతో సొరంగం తరహాలో ఉండే విద్యుత్‌ కేంద్రం అంతటా వేగంగా బూడిదతో కూడిన పొగ వ్యాపించింది. దీంతో సిబ్బంది ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోగా ఉత్పత్తి నిలుపుదల చేసి, బయటి సబ్‌ స్టేషన్‌ నుంచి రివర్స్‌ సప్లై లేకుండా చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదని జెన్‌కో సీనియర్‌ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. 

గేటు తీయాలంటే భయం !
శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం 4వ యూనిట్‌ సర్జ్‌పూల్‌ బయటి మార్గం నుంచి 75 మీటర్లు లోపలికి వెళ్లి నీళ్లలో మునిగి ఉన్న భారీ గేటును బయటికి తీసే సమయంలో ప్రమా­దం జరిగే అవకాశం ఉండడంతో ఈ పని చేసేందుకు ఎవరూ సాహసించడం లేదని జెన్‌కో వర్గాలు తెలిపాయి. ప్రమాదకర రీతిలో కాకుండా సురక్షితమైన పద్ధతిలో ఈ గేటును బయటకు తీయాలనే ఆలోచనతో ఈ పనిని పెండింగ్‌లో పెట్టా­రు. జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన తర్వాత 4 యూనిట్‌ ప్రధాన మార్గం నుంచే ఈ గేటును బయటకు తీయా­లని జెన్‌కో ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు