‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది

20 Aug, 2021 09:05 IST|Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ దోమలపెంట(అచ్చంపేట): టీఎస్‌ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్తు కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సంఘటన టీఎస్‌ జెన్‌కో చరిత్రలో మాయనిమచ్చగా మిగిలింది. 2020 ఆగస్టు 20న అర్ధరాత్రి ఇక్కడి నాలుగో యూనిట్‌లోని ప్యానల్‌బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో ఐదుగురు ఇంజినీర్లు, ఇద్దరు అసిస్టెంట్‌ ఇంజినీర్లు, మరో ఇద్దరు అమర్‌రాజ బ్యాటరీస్‌ కంపెనీకి చెందిన సిబ్బంది మరణించగా, మరో ఎనిమిది మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.  

ఉక్కిరిబిక్కిరై మృత్యువాత
శ్రీశైలం భూగర్భజల విద్యుత్‌ కేంద్రంలో నాడు అగ్రిప్రమాదం సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించడంతో యూనిట్‌లోని ఉద్యోగులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరై తొమ్మిది మంది మరణించారు. వీరిలో డీఈ శ్రీనివాస్‌రావు (40), ఏఈ మర్సకట్ల పెద్ద వెంకట్రావ్‌ (46), ఏఈ మోహన్‌కుమార్‌ (33), ఏఈ ఉజ్మాఫాతిమా (27), ఏఈ సుందర్‌ (37), ప్లాంట్‌ అటెండర్‌ రాంబాబు (43), జూనియర్‌ ప్లాంట్‌ అంటెడర్‌ కిరణ్‌కుమార్‌ (30), అమరాన్‌ కంపెనీ ఉద్యోగులు వినేశ్‌కుమార్‌ (36), మహేశ్‌కుమార్‌ (38) మరణించారు. వీరంతా ఎస్కేప్‌ టన్నెల్‌ ద్వారా బయటకు వచ్చేందుకు యత్నించినా, దట్టమైన పొగతో ఊపిరి తీసుకునేందుకు వీలుపడని పరిస్థితి నెలకొనడంతో మరణించారు. 

పునరుద్ధరణ వైపు.. 
గతేడాది అక్టోబర్‌ 26న జలవిద్యుత్‌ కేంద్రంలోని 1, 2వ యూనిట్లలో పునరుద్ధరణ చేపట్టి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ఐదు నెలలకు 3, 5, 6వ యూనిట్లను సైతం  పునరుద్ధరించి విద్యుదుత్పత్తి చేపట్టారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి  ఇప్పటివరకు 646.56 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కాగా 2021–22లో శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రానికి టీఎస్‌ జెన్‌కో విధించిన లక్ష్యం 1,450 మిలియన్‌ యూనిట్లు. మొత్తం ఆరు యూనిట్లకుగాను ఒక్కో యూనిట్‌ 150 మెగావాట్ల చొప్పున మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. కాగా అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కేంద్రంలో ఇప్పటివరకు నాలుగు యూనిట్లను పునరుద్ధరించారు. 4వ యూనిట్‌ మాత్రమే పునరుద్ధరించాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు