ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద

1 Sep, 2021 02:23 IST|Sakshi
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 24 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి విడుదలవుతున్న నీరు

24 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల

బాల్కొండ:     శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి మహారాష్ట్ర, స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు మళ్లీ పోటెత్తింది. దీంతో 24 గేట్లను ఎత్తి నీటిని గోదావరి దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్, నిర్మల్‌ జిల్లాలోని గడ్డెన్న వాగుల నుంచి వరద ఉధృతం కావడంతో సోమవారం అర్ధరాత్రి 12 గేట్లు ఎత్తిన అధికారులు.. మంగళ వారం మధ్యాహ్నానికి 24 గేట్లను ఎత్తి లక్ష క్యూసె క్కులు నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా 87 వేల క్యూసెక్కుల వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది. విష్ణుపురి ప్రాజెక్ట్‌ నుంచి 40 వేల క్యూసెక్కులు వస్తుండగా, స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి మిగతా వరద వస్తోంది.

ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (90 టీఎంసీల సామర్థ్యం) అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్‌ నిండుకుండలా ఉంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా 2,500  క్యూసె క్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం 152 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువకు నీటి విడుదలతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 36.15 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని జెన్‌కో డీఈ శ్రీనివాస్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు