అబ్బాయి పుడితే రూ..2 వేలు, అమ్మాయి పుడితే రూ.15 వందలు.. 

25 Jun, 2021 11:41 IST|Sakshi
పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి

పాపకో రేటు.. బాబుకో రేటు..!

దివంగత నేత వైఎస్సార్‌ ఆశయం..

గర్భిణులకు అందుబాటులో ఆధునిక వైద్యం..

 ఆయన ఆశయానికి తూట్లు

అక్రమ వసూళ్లు లేవంటున్న సిబ్బంది... 

సాక్షి, చార్మినార్‌: పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నా.. వైద్య సేవలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. దీంతో గర్భిణులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాతబస్తీలో గర్భిణుల కోసం అత్యంత అధునాతనమైన వైద్య సేవలు అందించడానికి పేట్ల బురుజులో ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఉంది. ఇక్కడ దోమల బెడద అధికంగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బాత్‌రూంలతో పాటు పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉందంటున్నారు. 

డబ్బులు ఇవ్వందే ఏ పనీ కాదు... 
► కింది స్థాయి సిబ్బంది గర్భిణుల వద్ద నుంచి ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని బోరు మంటున్నారు. 
►  మగ పిల్లవాడు పుడితే రూ. 2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.15 వందలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
► ప్రసవం జరిగిన వెంటనే పాప, బాబులను చూపించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వినిపిస్తుంటాయి. 
► అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు. 
► ఈ విషయాన్ని సంబంధిత వైద్యాధికారులతో పాటు సిబ్బంది ఖండించారు. 
►  వారి సంతోషం కోసం చాయ్‌ తాగమని ఎవరైనా డబ్బులిస్తే ఇచ్చి ఉండవచ్చుగానీ..సిబ్బంది డిమాండ్‌ చేయడం లేదన్నారు. 

634 పడకల ఆస్పత్రిలో రౌండ్‌ ది క్లాక్‌ వైద్య సేవలు.. 
►  పాతబస్తీ పేద మహిళలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌రాజ శేఖర్‌రెడ్డి పేట్ల బురుజులో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.  
►  మొదట్లో 462 పడకల ఈ ఆస్పత్రిలో మరో 172 పడకలను పెంచి..మొత్తం 634 తో  రౌండ్‌ ది క్లాక్‌ వైద్య సేవలను అందిస్తున్నారు.   
►  ప్రతి రోజూ ఉదయం అవుట్‌ పేషంట్‌లకు వైద్య సేవలు కొనసాగుతాయి. అవుట్‌ పేషంట్‌ విభాగం మూసిన అనంతరం అత్యవసర కేసులను రౌండ్‌ ది క్లాక్‌ తీసుకుంటారు. 
►  కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేస్తారు. మల,మూత్ర,రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌ రేను ఉచితంగా నిర్వహిస్తారు.  
► రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అసౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి.  
► పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రిలో సౌకర్యాలను కూడా పెంచాలని రోగులు వారి బంధువులు కోరుతున్నారు. 

చదవండి: మాజీ కార్పొరేటర్‌ దారుణ హత్య.. ఖండించిన సీఎం

మరిన్ని వార్తలు