Munawar Faruqui: స్టాండప్‌ కమెడియన్‌ రాకపై కాక,.. తగ్గేదెవరో.. నెగ్గేదెవరో?

26 Dec, 2021 07:59 IST|Sakshi

సిటీలో వివాదానికి తెర లేపిన షో 

Munawar Faruqui Hyderabad Show: నూతన సంవత్సరం మొదలవక ముందే కొత్త వివాదాన్ని వెంటబెట్టుకు వస్తోంది. జనవరి 9న నగరంలో జరగనున్న కామెడీ షో...  సెంటరాఫ్‌ పాలిటిక్స్‌గా మారి సీరియస్‌ రంగు పులుముకుంది. వివాదాలకు కేరాఫ్‌ లాంటి ఆ స్టాండప్‌ కమెడియన్‌ సిటిజనులను నవ్విస్తాడా.. గొడవలకు తావిస్తాడా? అనేది తేలాల్సిందే.   
- సాక్షి, హైదరాబాద్‌: 

‘సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనుమతించినా.. విధ్వంసమే గెలిచింది. కళాకారుడు ఓడిపోయాడు. ఇక సెలవు’ అంటూ పోస్ట్‌ చేశాడు స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ. తాజాగా తన బెంగళూర్‌ షో రద్దయిన తర్వాత అతని స్పందన ఇది. ఈ స్పందనే అతడిని హైదరాబాద్‌లోని కొందరికి చేరువ చేసింది. నగరానికి రా రమ్మంటూ ఆహ్వానించేలా పురిగొల్పింది.  

నవ్వులా... నువ్వు రా.. 
తన షో రద్దవడంపై ఫారూఖీ చేసిన పోస్ట్‌ వైరల్‌ కావడంతో  హైదరాబాద్‌ రావాలంటూ నెటిజనులు అతడిని ఆహ్వానించారు. అదే సమయంలో  కామెడీ షోలను సీరియస్‌గా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదనీ, రాజకీయ కారణాల వల్ల మేం మునావర్‌ షో వంటివి క్యాన్సిల్‌ చేయలేమని మంత్రి కేటీఆర్‌ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వంపై ఎవరు చేసే విమర్శలనైనా స్వాగతిస్తామన్నారు.  ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌కు రావాలనీ తమది అచ్చమైన కాస్మొపాలిటన్‌ సిటీ అని స్పష్టం చేశారు. దీంతో మునావర్‌ సిటీలో షో నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. బెంగళూర్‌లో ముగిసిన వివాదం నగరంలో మొదలైంది. 
చదవండి: కేటీఆర్‌ కౌంటర్‌ ట్వీట్‌


 
కామెడీ నుంచి కాంట్రావర్సియల్‌ దాకా.. 
గుజరాత్‌కు చెందిన స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ... దేశంలోనే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చిన అత్యంత వివాదాస్పద స్టాండప్‌ ఆర్టిస్ట్‌. హాస్య ప్రదర్శనల్లో మునావర్‌ ఎంచుకునే అంశాలన్నీ రాజకీయ సమకాలీన అంశాల చుట్టే ఉంటాయి. గుజరాత్‌ అల్లర్ల సమయంలో తన కుటుంబం పడిన ఇబ్బందుల్ని కూడా కామెడీగా మార్చి బీజేపీపై సెటైర్లు వేస్తాడితడు. గతంలో ఎన్‌ఆర్‌సీ, ఢిల్లీ గొడవలపై ఆయన చేసిన కామెడీ సాంగ్‌ కూడా వివాదాస్పదమైంది.

హిందూ దేవతలపై, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడని గత జనవరి 1న ఇండోర్‌ పోలీసులు మునావర్‌ని అరెస్ట్‌ చేశారు. నెల రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. తన షోస్‌లో కుబేరులైన అంబానీ, అదానీపై కూడా పంచ్‌లు వేస్తుంటాడు. జర్నలిస్టుల్నీ వదలని మునావర్‌.. సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసులో రిపబ్లిక్‌ టీవీ కథనాలపై,  అర్నాబ్‌ గోస్వామిపైనా సెటైర్లు వేశాడు. ఈ నేపథ్యంలో  హిందూ దేవతల్ని బీజేపీ నాయకుల్ని కించపరుస్తున్నాడని ఆ పార్టీ అనుబంధ సంస్థలు దండెత్తడంతో.. గడిచిన 2 నెలల్లో 12 కామెడీ షోలు రద్దయ్యాయి.  

గతంలోనూ సిటీలో షో 
మునావర్‌ గతంలో కూడా నగరానికి వచ్చాడు. తన హాస్య ప్రదర్శనల ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చివరి సారిగా గత డిసెంబర్‌ 20న మునావర్‌ నగరంలో షో నిర్వహించాడు. ఆ షో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇండోర్‌లో షో నిర్వహించిన మునావర్‌... అక్కడ అరెస్ట్‌ అయి నెల రోజులు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత అతను మరింత వివాదాస్పద సెలెబ్రిటీ అయ్యాడు. తాజాగా బెంగళూరు షో క్యాన్సిల్‌ అయిన తర్వాత తీవ్ర నిర్వేదానికి లోనైన మునావర్‌ ఇక తాను స్టాండప్‌ కామెడీకి గుడ్‌ బై చెప్తున్నా అని ప్రకటించాడు. అయితే నగరంలోని అభిమానుల నుంచి వెల్లువెత్తిన మద్దతు మరీ ముఖ్యంగా కేటీఆర్‌ ప్రసంగం మునావర్‌ను సిటీలో కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు స్పూర్తినిచ్చాయి.

అగ్గి ‘రాజ’కుంది.. 
గుజరాత్‌లో పొమ్మంటే మునావర్‌ ఇక్కడకి వస్తున్నాడు అన్నారు సిటీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే తాము అతడిని తరిమికొట్టడానికైనా రెడీ అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సైతం స్పందించారు. హిందూ వ్యతిరేకులను తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమన్నారు. తమ యువమోర్చా కార్యకర్తలు మునావర్‌ని అడ్డుకుని తీరతారని స్పష్టం చేశారు. 

ఓ వైపు ప్రభుత్వం షో నిర్వహణకు అనుకూలంగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షం అడ్డుకుంటామంటున్న నేపథ్యంలో నిరసనలకు తలొగ్గి మునావర్‌ వెనుకంజ వేస్తాడా? లేక నగరంలో షో చూపిస్తాడా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా... నగరంలో ఈ నవ్వుల ప్రదర్శన సృష్టించిన వివాదం ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకు దారి తీయకుండా ముగిసిపోవాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు.  

వాస్తవంలోనుంచే హాస్యం.. 
ట్రూత్‌ అనే ఆంగ్ల పదంలో ఉండే హెచ్‌ అక్షరం హ్యూమర్‌ని ప్రతిబింబిస్తుంది. చుట్టూ జరుగుతున్న వాస్తవిక సంఘటనల నుంచే హాస్యం పుడుతుంది. కళను కళగానే చూడాలి. హైదరాబాద్‌ నుంచి వెళ్లి, ఇండోర్‌లోని మా సొంత ఊరిలో రెండో ప్రదర్శన నిర్వహించిన రోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మేం కూడా కొంత టెన్షన్‌ పడ్డాం. ఇలాంటి భయాందోళనలు కళకు, కళాకారులకు మంచిది కాదు. క్యాస్టిజమ్, సెక్సిజమ్, బాడీ షేమింగ్, వెర్బల్‌ వయొలెన్స్, హోమో ఫోబియా, ట్రాన్స్‌ ఫోబియా తదితర సంకెళ్ల నుంచి కళను విముక్తం చేయాలి. 
– శశి అండ్‌ మాన్సి  
(స్టాండప్‌ కామెడీ కళాకారులు)  

మరిన్ని వార్తలు