ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ఘనమైన వీడ్కోలు!

31 Jan, 2021 10:34 IST|Sakshi

పదవీ విరమణ సన్మానాలకు స్టాండర్డ్‌ ప్రొటోకాల్‌ 

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశం 

సచివాలయంలో ఉద్యోగుల 

పదవీ విరమణ సన్మాన సభ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజు ఘనంగా సన్మానించి ప్రభుత్వ వాహనంలో స్వగృహానికి సాగనంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలు (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌)ను తయారు చేయాలని అధికారులను కోరారు. పదవీ విరమణ చేసిన ఏడుగురు సచివాలయ ఉద్యోగులకు శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సన్మాన సభ నిర్వహించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గౌరవంగా వ్యవహరించాలని, పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను ఈసందర్భంగా సీఎస్‌ కొనియాడారు. సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి జి.క్రిష్ణవేణి, ఆ శాఖ ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎన్‌.గంగమ్మ, ఐటీ శాఖ ఉప కార్యదర్శి టి.పద్మసుందరి, మైనారిటీ వెల్ఫేర్‌ శాఖ సహాయ కార్యదర్శి మహమ్మ ద్‌ నసీర్, పంచాయతీరాజ్‌ శాఖ సహాయ కార్యదర్శి మంజుల, ఆర్‌అండ్‌బీ శాఖ సెక్ష న్‌ ఆఫీసర్‌ అర్జున్‌ సింగ్, ఆర్థిక శాఖ సెక్షన్‌ అసిస్టెంట్‌ పాల్‌ ఫ్రాన్సిస్‌ పదవీ వీరమణ పొందిన వారిలో ఉన్నారు.  కాగా, అటవీశాఖలో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా రిటైర్‌ అయిన కౌసర్‌ అలీకి కూడా ఆ శాఖ అధికారులు సగౌరవంగా వీడ్కోలు పలికారు. 

మరిన్ని వార్తలు