జీవశాస్త్ర రంగంలో రాష్ట్రం దూకుడు!

15 Sep, 2023 02:33 IST|Sakshi

పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం: మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జీవశాస్త్ర రంగంలో దూకుడుగా ముందుకెళ్తోందని, ఈ ప్రగతి తమకెంతో గర్వకారణమని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. సిన్‌జీన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు చేపట్టడం రాష్ట్రంలోని అవకాశాలకు, ప్రభుత్వ సహకారానికి నిదర్శనమన్నారు. గురువారం జినోమ్‌ వ్యాలీలో సిన్‌జీన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌షాతో కలసి ఆ సంస్థ విస్తరణ కార్యకలాపాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రోత్సహిస్తోందని, తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని మంత్రి చెప్పారు. సిన్‌జీన్‌ సంస్థ 2020లోనే జినోమ్‌ వ్యాలీలో సుమారు 52వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది.

తాజాగా సుమారు 788 కోట్ల పెట్టుబడితో దీని విస్తరణ చేపట్టింది. ఇందులోభాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రోటాక్‌ ల్యాబొ రేటరీని, సెంట్రల్‌ కాంపౌండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ విస్తరణతో వచ్చే ఐదేళ్లలో వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తాయని కంపెనీ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌షా తెలిపారు. 

మరిన్ని వార్తలు