‘గవర్నర్‌ కోటా’ ఖరారు

14 Nov, 2020 02:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: శాసనమండలి గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో.. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం ముఖ్య సలహాదారు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌ పేర్లను ఖరారు చేశారు.

ఈ పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఆమోదం కోసం పంపించారు. గవర్నర్‌ ఆమోదం తర్వాత ఈ ముగ్గురు శాసనమండలికి ఎంపికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల నుంచి నామినేట్‌ అయ్యేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలతో పాటు పలువురు తటస్తులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే జిల్లాలు, సామాజిక సమీకరణాలతో పాటు త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు.. మండలి పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. 

సామాజిక వర్గాల సమతూకం...
దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన గోరటి వెంకన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రజాకవిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలపాత్ర పోషించారు. నాలుగు నెలల క్రితం సీఎం కేసీఆర్‌తో గోరటి భేటీ అయ్యారు. గవర్నర్‌ కోటాలో శాసన మండలికి వెంకన్నను నామినేట్‌ చేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా ఆయన పేరును మంత్రిమండలి ఖరారు చేసింది. అలాగే త్వరలో జరిగే వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య పేరు తెరమీదకు వచ్చింది.

గతంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన సారయ్య.. కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2016లో టీఆర్‌ఎస్‌లో చేరిన సారయ్య రజక సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో బీసీల నుంచి ఆయన పేరువైపు కేసీఆర్‌ మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇక మూడో ఎమ్మెల్సీ స్థానానికి వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్‌ పేరు అనూహ్యంగా తెరమీదకు రావడం టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దయానంద్‌ 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. వాసవీ సేవా కేంద్రం, వాసవీ సహకార హౌజింగ్‌ సొసైటీ తదితరాల్లో కీలక పదవుల్లో ఉన్న దయానంద్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌ కోటాలో స్థానం దక్కినట్లు భావిస్తున్నారు.

ఔత్సాహికుల ఆశలపై నీళ్లు...
మండలిలో గవర్నర్‌ కోటా సభ్యుల సంఖ్య ఆరు కాగా, ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఈ కోటాలో మండలికి ఎంపికైన రాములునాయక్‌ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయ్యారు. మండలి సభ్యుడిగా ఈయన పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ 19న.. కర్నె ప్రభాకర్‌ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 18న ముగిసింది.

వీరిద్దరూ మరోమారు మండలి సభ్యత్వాన్ని ఆశించారు. అయితే నాయిని ఇటీవల కరోనాతో మరణించగా, కర్నెకు అవకాశం దక్కలేదు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కవి, గాయకుడు, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ కూడా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించారు. అలాగే దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణిదేవీ పేరు కూడా కొంతకాలంగా వినిపించింది. 

నేడు పమ్రాణ స్వీకారం?
గవర్నర్‌ కోటాలో మండలికి నామినేట్‌ అయిన ముగ్గురు సభ్యులు శనివారం ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. కేబినెట్‌ ప్రతిపాదనను ఆమోదిస్తూ గవర్నర్‌ గెజిట్‌ విడుదల చేసిన వెంటనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వెంకన్న, సారయ్య, దయానంద్‌లను ఆదేశించినట్లు సమాచారం. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు జీహెచ్‌ఎంసీలో కో–ఆప్షన్‌ సభ్యులుగా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముంది. ఒకట్రెండు రోజుల్లో గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్‌లు శుక్రవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అనంతరం సారయ్య, దయానంద్‌లు మంత్రి కేటీఆర్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

మరిన్ని వార్తలు