9న రాష్ట్ర కేబినెట్‌ భేటీ! 

5 Mar, 2023 01:27 IST|Sakshi

కీలక అంశాలపై చర్చలు, నిర్ణయాలు 

ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష...

గతంలో ప్రకటించినా అమలుకాని హామీలపై పరిశీలన 

కొత్త పథకాలు, కార్యక్రమాల అమలు యోచన 

కీలక ప్రకటనలు వెలువడే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడం, కొత్త పథకాలపై నిర్ణయం తీసుకోవడం కోసం రాష్ట్ర కేబినెట్‌ ఈ నెల 9న సమావేశం కానుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ మొదలుకానుంది.

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో ఇంకా అమలుకాని వాటిని సమీక్షించనున్నట్టు తెలిసింది. నిరుద్యోగ భృతి, సొంత స్థలాలున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల చొప్పున ఆర్థికసాయం వంటి పథకాల అమలుకు అవకాశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

ఇక పేదలకు ఇళ్ల పట్టాలు, గిరిజన రైతులకు పోడు పట్టాల పంపిణీ, దళితబంధు అమలు, రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరిన్ని నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చివరిగా గత నెల 5న ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైనా.. కేవలం బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదానికి పరిమితమైంది. 

మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై చర్చ 
రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల కారణంగా రాష్ట్రం కొత్త రుణాలను సమీకరించలేకపోతోంది. రాష్ట్రంలో కీలక సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయ సమీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

గతంలో బాలానగర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ, హఫీజ్‌పేట మినీ ఇండ్రస్టియల్‌ ఎస్టేట్, ఆజామాబాద్‌ ఇండ్రస్టియల్‌ ఏరియాల నుంచి పలు పరిశ్రమలను నగర శివార్లలోకి తరలించారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన స్థలాలను క్రమబద్దీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.3వేల కోట్ల ఆదాయం రానుంది. వాలంతరి భూములను ప్లాట్లుగా విభజించి విక్రయించాలనే ప్రతిపాదన కూడా సిద్ధమైంది. వీటిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా కేబినెట్‌ భేటీలో కీలక ప్రకటనలు వెలువడవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు