మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు!

10 Feb, 2022 03:02 IST|Sakshi

అధికార వికేంద్రీకరణకు మరింత అవకాశం 

హరితహారం, పారిశుధ్యం, కమ్యూనిటీ భాగస్వామ్యం పెంచడానికే.. 

క్షేత్రస్థాయి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి అవకాశం 

84 కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా త్వరలోనే సిబ్బంది మంజూరు! 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీలకు కొత్త జవసత్వాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్డుస్థాయిలో పాలనావికేంద్రీకరణ జరిగే విధంగా కొత్త విధానాన్ని తీసుకు రావడానికి అడుగులు వేస్తోంది. కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమించాలని ఉన్నతస్థాయిలో జరిగిన పలు సమావేశాల అనంతరం నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం 142లో 13 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లోని డివిజన్లు/వార్డుల్లో ఈ అధికారులను నియమించాలని సర్కార్‌ యోచిస్తోంది.

ప్రజాప్రతినిధులతో వార్డు కమిటీలున్నా, వారిని సమన్వయం చేసుకోవడంతోపాటు వార్డుస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ఈ అధికారులను వినియోగించనున్నారు. దాదాపు 3,700 మంది అధికారులను ఇందుకోనం వినియోగించనున్నట్లు సమాచారం. పట్టణ ప్రగతిలో కీలకమైన హరితహారం, పారిశుధ్యం, నందనవనం, మహిళాసంఘాలను బలోపేతం చేయడం, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ వార్డు అధికారులను వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం వార్డు స్థాయిలో అధికారులు లేరు. జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో మాత్రం కొన్నిచోట్ల వార్డు కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమించడం ద్వారా ప్రజలకు మరింతగా పాలన చేరువ కావడానికి వీలుంటుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. 

కొత్తగా ఏర్పాటైన వాటికి స్టాఫ్‌ కూడా.. 
మూడేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 84 మున్సిలిటీలు, కార్పొరేషన్లకు సరిపడా సిబ్బందిలేరు. సిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. బిల్‌ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, అకౌంట్స్, మేనేజర్లు, కమిషనర్లు ఈ విధంగా దాదాపు 4 వేల పోస్టులకు పురపాలకశాఖ చాలా కాలక్రితమే ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది.

అవి కూడా త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. ఈ పోస్టుల భర్తీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో జారీ చేసే నోటిఫికేషన్ల సమయంలోనే ఇస్తారా? లేక మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నట్లు సమాచారం. కొత్త పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, కనీస సిబ్బంది లేకపోవడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు లేవని, మేనేజర్లు, అకౌంటెంట్లను కమిషనర్లుగా నియమించడం, కొన్నిచోట్ల ఒకటి రెండు మున్సిపాలిటీలకు కలిపి అధికారులు పనిచేస్తుండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల ఆకాంక్షలు పెరిగిపోతున్నాయని.. అందుకు అనుగుణంగా పనిచేయాలంటే తగిన సిబ్బంది అవససరం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు